మొత్తానికి తెలంగాణలో థియేటర్లకు తాళాలు తెరవబోతున్నాయి. ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసేసింది. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ఆడించుకోవచ్చని చెప్పేసింది. అయితే ముందు నుంచీ.. నిర్మాతలు ఇక్కడే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం టికెట్లతో సినిమాల్ని నడిపించుకోలేమన్నది వాళ్ల భయం. స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కేవే. తొలి మూడు రోజుల్లో థియేటర్లు నిండిపోయినా – పెట్టుబడులు తిరిగి రావడం లేదు. అలాంటిది సగం సిట్టింగ్ తో ఆ డబ్బు ని తిరిగి రాబట్టుకోవడం సాధ్యం కాదని వాపోతున్నారు.
”50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని నడిపించుకోవడం చాలా కష్టం. కనీసం 75 శాతం ఆక్యుపెన్సీ ఉంటే బాగుంటుంది. ఆ పాతిక శాతం విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి. నిర్మాతలంతా ప్రభుత్వాన్ని కోరేది ఇదొక్కటే. వంద శాతం ఆక్యుపెన్సీ లేకపోతే పెద్ద సినిమాలు విడుదల కావు. ఇప్పుడేదో అనుమతులు వచ్చాయని చిన్న సినిమాల్ని విడుదల చేసుకుంటారేమో..? ఇప్పటికిప్పుడు విడుదల చేసుకోవడానికి సినిమాలు కూడా రెడీగా లేవు. సంక్రాంతికల్లా పరిస్థితి చక్కబడుతుందని ఆశ” అని చెప్పుకొచ్చారు.
ఒక రోజు 4 ఆటలకు బదులుగా.. 6 -7 షోలు ప్రదర్శిస్తే. 50 శాతం ఆక్యుపెన్సీని కవర్ చేయొచ్చన్నది ప్రభుత్వం లాజిక్కు. కాకపోతే.. థియేటర్ నిర్వహణ వ్యయం అధికం అవుతుంది. 50 % సిట్టింగ్ ఉన్నప్పుడూ.. థియేటర్ యాజమాన్యానికి ఒకటే ఖర్చు, 100 శాతం సిట్టింగ్ ఉన్నప్పుడూ ఒకటే ఖర్చు. సగం సగం ప్రేక్షకులతో రెండు షోలు వేస్తే… వ్యయం డబుల్ అవుతుంది. ఆదాయం మాత్రం ఒకేలా వస్తుంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేటుని డబుల్ చేస్తే తప్ప… ఆ లోటుని భర్తీ చేయడం కుదరదు. సో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే… థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఇప్పట్లో పెద్ద సినిమాలు రావు. పరిస్థితులు చక్కబడి.. ప్రభుత్వం నిర్మాతల ఒత్తిడికి తల వొంచి, 100 శాతం కాకపోయినా 75 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చేంత వరకూ స్టార్సినిమాలు రానే రావు.