చిత్రసీమ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభ ఘడియ ఇది. థియేటర్లకు మోక్షం ఎప్పుడు వస్తుందో, తాళాలు ఎప్పుడు తెరుస్తారో.. అన్న నిరీక్షణకు తెర దించుతూ – ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఇక ఏ క్షణంలో అయినా, థియేటర్లు తెరచుకోవొచ్చు. కొత్త నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని… నిర్మాతలు అడుగులు వేయాల్సివుందిప్పుడు. 50 శాతం ఆక్యుపెన్సీ మినహాయిస్తే – మిగిలిన నిబంధనలేం సమస్య కాదు. కాకపోతే.. ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్న సినిమాలేంటి? అన్నది ఆసక్తిగా మారింది. మరీ పెద్ద సినిమాలు ఇప్పటి కిప్పుడు రాకపోవచ్చు. కానీ, చిన్నా, మీడియం రేంజు సినిమాలు మాత్రం విడుదల చేసుకోవడానికి మార్గం సుగమం అయినట్టే.
వైష్ణవ్ తేజ్ సినిమా `ఉప్పెన` విడుదలకు రెడీగా ఉందిప్పుడు. ఇప్పటికే మూడు పాటలు కూడా బయటకు వచ్చేశాయి. ప్రమోషన్ పరంగా `ఉప్పెన` టీమ్ ఎవర్ రెడీగా ఉన్నట్టే. టీజర్, ట్రైలర్ బయటకు వస్తే… ఇక రిలీజ్ డేట్ ప్రకటించడమే తరువాయి అవుతుంది. `సోలో బతుకే సో బెటరు` కూడా డిసెంబరులోనే వస్తుంది. ఇప్పటికే చిత్రబృందం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. క్రిస్మస్కి ఈ సినిమా రావొచ్చు. అఖిల్ సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సంక్రాంతికి రావాలి. పరిస్థితులు అనుకూలిస్తే.. ఆ సినిమాని కాస్త ముందుగా విడుదల చేయొచ్చు. ప్రదీప్ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` కూడా.. రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన ఆకాశమే నీ హద్దురా, కలర్‌ఫొటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాల్ని… ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది.