టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20వేల లీటర్ల మంచినీరు ఉచితం అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తానేం తక్కువ తినలేదని.. తాము 30వేల లీటర్లు ఇస్తామని హామీ ఇచ్చేసింది. గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను.. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఎక్కడా తగ్గలేదు. బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దర్నీ కలిపి దాటేయాలని ప్రయత్నించింది. టీఆర్ఎస్ రూ. పదివేల సాయాన్ని ఎన్నికలు అయిపోయిన వెంటనే చేస్తామని చెబుతోంది. బీజేపీ ఈ సాయం పాతిక వేలుగా ప్రకటించింది. కానీ.. కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకెళ్లింది ఏకంగా యాభై వేల సాంయ ప్రకటించేసింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు సాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చేశారు.
ఇక ఎంఎంటీఎస్, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం హామీ కూడా ఉంది. మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్పోర్టు వరకు పొడిగించడం.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్పించడం.. కార్పొరేట్ విద్యా సంస్థలల్లో ఫీజులను నియంత్రించడం లాంటి హామీలు కూడా ఉన్నాయి. 100 యూనిట్లలోపు గృహవినియోగదారులకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. వరదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వరద రహిత హైదరాబాద్ కోసం జపాన్, జర్మనీ టెక్నాలజీ తీసుకొస్తామన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి.. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు చేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయ పార్టీల హామీలు.. ఒకరు ఒకటి అంటే.. మరొకరు రెండు అంటున్నారు. కానీ నిధులు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. అటు టీఆర్ఎస్ అయినా.. ఇటు బీజేపీ అయినా… కాంగ్రెస్ అయినా అదే పరిస్థితి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు.. నిధుల విషయంలో తలోమాట చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ ఎక్కడి నుంచి తెస్తుందో చెప్పడానికి చాన్స్ లేదు. జరుగుతోందని అసెంబ్లీ ఎన్నికలన్నట్లుగా అన్ని రకాల హామీలు ఇచ్చేస్తున్నారు. వాటిని ప్రజలు ఎంత వరకూ నమ్ముతారన్నదాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.