చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.పదివేల పూచీకత్తు లేని అప్పు ఇప్పిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఐదారు నెలల పాటు తోపుడు బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు.. బడ్డీ కొట్లు పెట్టుకున్నవారు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఇప్పుడు.. పెట్టుబడి సాయం అవసరం కాబట్టి.. ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. చాలా మంది చిన్న వ్యాపారులు..రోజువారీ వడ్డీలకు తీసుకుంటూ ఉంటారు. వారందరికీ రుణవిముక్తి కల్పించడానికి రూ. పదివేల రుణం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ మీట నొక్కి.,. ముఖ్యమంత్రి జగన్ డబ్బులను బదిలీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.
రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులు. వీరితో పాటు చేతి వృత్తి దారులైన లేస్ వర్క్, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలి వీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తి కళాకారులకు సైతం వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రూ.పది వేలు రుణం లభిస్తుంది.
ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంజూరు పత్రాలనుసిద్ధం చేశారు. చిరు వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికీ రుణాలందిస్తారు. అయితే జగనన్న తోడు పథకం కింద.. ప్రభుత్వం రుణం ఇవ్వడం లేదు. బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నారు. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తర్వాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రీయింబర్స్ చేస్తుంది. బ్యాంకులు సహకరించడం మీదే మొత్తం ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి మీట నొక్కినప్పటికీ లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం లేదు. బ్యాంకులు మంజూరు చేయాల్సి ఉంది.