బీజేపీ మాజీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు బీజేపీలోనే పొగ పెడుతున్నారు. ఇప్పటికే ఆయనను పార్టీ వ్యవహారాల్లో కరివేపాకులా పక్కన పెట్టేశారు. వైసీపీ అవినీతిపై ఆయన చేసిన పోరాటం నచ్చలేదో.. అలా పోరాటం చేయడం అంటే.. టీడీపీకి మేలు చేయడం అనే వైసీపీ ప్రచారం ట్రాప్‌లో పడ్డారో కానీ.. మొత్తానికి ఆయన పదవిని ఊడబీకేశారు. తర్వాత ఎలాంటి పదవి ఇవ్వలేదు. సాధారణంగా రాష్ట్ర అధ్యక్ష పదవి స్థాయిలో పని చేసిన వారికి తర్వాత జాతీయ స్థాయిలో ఏదో ఓ పదవి ఇస్తారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా పని చేసిన లక్ష్మణ్‌కు జాతీయ స్థాయిలో ఓబీసీ మర్చి పదవి ఇచ్చారు. కానీ కన్నాను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఎలాంటి పదవి ఇవ్వలేదు.
కన్నాను పట్టించుకోకపోగా.. ఇప్పుడు బీజేపీ వైపు నుంచి.. వైసీపీ వైపు నుంచి ఒకే రకరమైన ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు. ఆయనను బీజేపీ నుంచి బయటకు పంపాలన్న ప్రణాళికతో.. వీడియోలు వదులుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలనుకుంటున్నారని .. నేడో రేపో చేరిపోతారని ప్రచారం చేస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ రాజకీయ జీవితం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి ప్రచారం చేయరు. కన్నాకు చంద్రబాబు పొడే గిట్టదు. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేయడంలో ఆయన ముందు ఉంటారు. కానీ ఆయను ఎలా అయినా బీజేపీ నుంచి బయటకు పంపాలన్న ఉద్దేశంతో చంద్రబాబుకు లింక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి కన్నా బీజేపీలో ఉండి.. తన రాజకీయ భవిష్యత్‌కు నష్టం చేసుకున్నారు. వైసీపీలో చేరడానికి సిద్ధమై.. ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టుకుని… అమిత్ షా ఫోన్ చేశారని ఆగిపోయారు. లేకపోతే.. ఈ పాటికి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. ఆ విషయం చెప్పడానికి ప్రత్యేకంగా విశ్లేషణలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా.. ఆయన ఆసక్తి చూపిస్తే.. వైసీపీలో చేర్చుకుంటారు. ఆయనకు వర్గ బలం ఉంది. ఎలాగైనా ఆయనను ముందుగా బీజేపీ నుంచి బయటకు పంపాలన్న ప్రణాళికను మాత్రం.. వైసీపీ, బీజేపీ సోషల్ మీడియా టీంలు.. అమలు చేస్తున్నాయి. మరి ఈ వ్యూహాన్ని కన్నా ఎలా ఎదుర్కుంటారో..?