హారర్, థ్రిల్లర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హారర్ అనగానే… భయంకరమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్రలు విచిత్రంగా ప్రవర్తించడం.. ఇవే కనిపిస్తాయి. థ్రిల్లర్లూ అందుకు మినహాయింపు కాదు. కథంతా ఒకే పాయింట్ చుట్టూ చుట్టేసి విసిగెత్తించాయి. అయితే… `అంధకారం` చూస్తే – థ్రిల్లర్, హారర్‌ని ఇలా మిక్స్ చేయొచ్చా? అనిపిస్తుంది. పాత జోనర్‌ని తీసుకెళ్లి ఓ కొత్త ఫార్మెట్లో పరిచయం చేసిన అనుభూతి కలుగుతుంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమా ఇది. `అంధకారం` ప్రత్యేకతలేంటి? ఎవరికి నచ్చుతుంది? ఈ వివరాల్లోకి వెళ్తే..
సూర్యం అంథుడు. నా అన్న వాళ్లెవరూ లేరు. ఓ లైబ్రెరీలో పనిచేస్తుంటాడు. కిడ్నీ మార్పిడికి 80 వేలు అవసరం అవుతాయి. దాన్ని సంపాదించడానికి నాన్న ఇచ్చి వెళ్లిపోయిన విద్యని నమ్ముకుంటాడు. ఆ విద్య…. ఆత్మలతో మాట్లాడడం. ఓ ఆపార్ట్మెంట్ లో తిరుగుతున్న ఆత్మని బంధిస్తే లక్షరూపాయలు వస్తాయి. అందుకోసం ఆ ఆపార్ట్మెంట్ కి వెళ్తాడు.
వినోద్ ఓ క్రికెట్ కోచ్. తన ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. అయితే… ఓ ఫోన్ కాల్ అతన్ని వేధిస్తూ ఉంటుంది. తన రూమ్, తన జీవితంలో జరిగిన విషయాల్ని పూస గుచ్చినట్టు చెబుతుంటుంది అవతలి గొంతు. వినోద్ ని బెదిరిస్తుంది, భయపెడుతుంది. వెంటాడుతుంది.
ఇంద్రన్ ఓ మానసిక వైద్యుడు. చాలామంది మానసిక బాధల్ని నయం చేశాడు. అయితే ఇప్పుడు తను మానసికంగా నలిగిపోతున్నాడు. కౌన్సిల్ అతన్ని నిషేధిస్తుంది. ఎవరికీ ట్రీట్ మెంట్ ఇవ్వకూడదని గట్టిగా చెబుతుంది. అతని క్లినిక్ కూడా మూసేస్తారు. అయితే ఎవరికీ తెలియకుండా నేరుగా.. పేషెంట్ ఇంటికే వెళ్లి చికిత్స చేస్తుంటాడు. సూర్యం, వినోద్, ఇంద్రన్లకు ఉన్న లింక్ ఏమిటి? సూర్యం ఆపరేషన్‌కి డబ్బులు దొరికాయా? వినోద్‌ని ఫోన్ లో వేధిస్తోంది ఎవరు? ఇంద్రన్ నేపథ్యం ఏమిటి? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
కథ ఇంత సింపుల్‌గా చెప్పినా.. ట్రీట్ మెంట్ ఇంత సింపుల్ గాఉండదు. తొలి సన్నివేశంలోనే.. ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. తెరపై ఒకొక్క సన్నివేశం వచ్చి పోతుంటుంది. అయితే ఇందతా ఏమిటో? ఎందుకు జరుగుతుందో ప్రేక్షకుడికి అర్థం కాదు. గందరగోళంగా ఉంటుంది. కానీ.. ఆయాసన్నివేశాలు ఒకే మూడ్‌లో, ఒకే టెక్నిక్ తో సాగుతుంటాయి. సినిమా తాలుకూ కలర్, టోన్.. అన్నీ ఒకే రీతిలో నడుస్తుంటాయి. ఆ విధానం బాగుంది. ఇప్పటి వరకూ థ్రిల్లర్, హారర్ జోనర్లో చూసిన ఏ సినిమాకీ, అందులోని ఏ సన్నివేశానికీ పోలిక కనిపించదు. దర్శకుడు.. ఓ కొత్త పంథాలో వెళ్లాడు. పాత్రల ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపిస్తున్నా, వాటి చుట్టూ ఏదో ఉందన్న విషయం మాత్రం అర్థం అవుతుంది. సగం సినిమా గడిచినా… ఈ కథ ఏ జోనర్లో సాగుతోందో.. అసలు ముడి ఏమిటో తెలియకపోవడం… కాస్త మైనస్ అని చెప్పాలి. పైగా.. నిడివి కూడా ఎక్కువే. దర్శకుడు ఏం రాసుకున్నాడో, అదే తీసుకుంటూ వెళ్లాడు. ఆ డిటైలింగ్ కాస్త ఇరిటేట్ చేస్తుంది. కానీ.. సినిమా మూడ్ కి మాత్రం.. అలా తీయడమే కరెక్ట్ అనిపిస్తుంది.
చివరి పావు గంట.. ఈ కథని మరో లెవల్‌కి తీసుకెళ్తాడు దర్శకుడు. అప్పటి వరకూ వేసిన చిక్కుముడులన్నీ విప్పుకుంటూ వెళ్తుంటే.. అసలు ఏ సన్నివేశం, ఎందుకు జరిగిందో అర్థం అవుతుంటుంది. ఇది హారర్ సినిమానే. కానీ దెయ్యాలు, ఆత్మలూ ఏం కనిపించవు. ఓ వస్తువుని మీడియంగా చేస్తుకుని ఆత్మలు… బలహీనమైన వ్యక్తుల్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? అన్నది పాయింట్. దాన్ని చాలా బాగా డీల్ చేశాడనిపిస్తుంది. కాకపోతే.. ఇంత వరకూ చూడని నటీనటులు కనిపించడం వల్ల, వాళ్లని ఐడెంటిఫై చేసి, ఆ పాత్రలతో పాటు ప్రేక్షకుడూ ప్రయాణం చేయడం మొదట్లో కాస్త కష్టం అవుతుంది. పైగా.. రెండు పాత్రలు బేస్ వాయిస్ తో మాట్లాడుతుంటాయి. అసలే సన్నివేశాలు గజిబిజిగా సాగుతుంటాయి. దానికి తోడు బేస్ వాయిస్ ఒకటి. దాంతో.. ఇంకాస్త కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంట్లో.. ఓటీటీలో చూసే అవకాశం ఉంది కాబట్టి.. పాజ్ ఇచ్చి, కాస్త రివైండ్ చేసి, ఆ డైలాగేదో స్పష్టంగా ఇంకోసారి వినే ఛాన్సుంది. అదే థియేటర్లో చూస్తే…? పైగా 2 గంటల 50 నిమిషాల సినిమా ఇది. థ్రిల్లర్ నిడివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంటుంటారు. ఆ సూత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు దర్శకుడు.
ముఖ్యంగా నాలుగు పాత్రల చుట్టూ సాగే కథ ఇది. ఒకొక్కరిదీ ఒక్కో నేపథ్యం. ఆయా పాత్రల కోసం ఎంచుకున్న నటీనటులు పర్ఫెక్ట్గా తమ వంతు న్యాయం చేశారు. అత్యంత సహజంగా నటించారు. ఎవరూ స్కేల్ దాటి ప్రవర్తించలేదు. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్, ఆర్ట్…. ఇవన్నీ ఓ టోన్ లో ఉంటాయి. దర్శకుడి భావాలను అనుగుణంగా పనిచేశారంతా. కొన్ని సంభాషణలూ ఆకట్టుకుంటాయి.చీకటి, తప్పు వీటి గురించి చెప్పిన డైలాగులు కథ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఇలాంటి సినిమాలే వస్తాయి. తొలి సన్నివేశాల్లో కాస్త గందరగోళం, ఎంతకీ పాయింట్ కి రాకపోవడం, నిడివి ఎక్కువ.. ఇలాంటి ఇబ్బందులు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులు ఓ సరికొత్త థ్రిల్లర్ చూడాలంటే.. మాత్రం నెట్ ఫ్లిక్స్‌లోకి వెళ్లి, అంధకారం బటన్ నొక్కాల్సిందే.