ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ కేసు విషయాలు.. ఎఫ్ఐఆర్లోని అంశాలను మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం చేయవచ్చు. అదే సమయంలో ఆ కేసులో ఎఫ్ఐఆర్పై దర్యాప్తుపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే విషయంలో సుప్రీంకోర్టు కలుగచేసుకోలేదు. ఆ ఎఫ్ఐఆర్పై అన్ని రకాల విచారణలను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుంది. సీనియర్ న్యాయవాది, గత ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ అమరావతి ప్రాంతంలో అక్రమంగా భూములు కొన్నారంటూ ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేసింది.
మామ, బావమరిది ద్వారా కృష్ణా జిల్లాలో ఆస్తులు కొనుగోలు చేశారంటూ ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆస్తులు కొనుగోలు చేశారని ఏసీబీ తెలిపింది. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులోనే దమ్మాలపాటితో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు ఆరోపణలతో కూడినదని.. దుష్ప్రచారం చేసి.. తప్పుడు కేసులు పెట్టడానికేనని.. తక్షణం ఆ ఎఫ్ఐఆర్పై దర్యాప్తు నిలిపివేస్తూ.. అందులో ఉన్న విషయాలేమీ మీడియాలో రాకుండా చూడాలని దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఎఫ్ఐఆర్ పై విచారణపై కూడా స్టే ఇచ్చింది. ఆ మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. స్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. పూర్తి వాదనలు విన్న తర్వాత గ్యాగ్ ఆర్డర్ పై ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తొలగించింది. విచారణపై స్టే మాత్రం కొనసాగుతుంది. తదుపరి విచారణను జనవరి ఆఖరకు వాయిదా వేసింది. ఈ కేసులో అధికార కక్ష సాధింపులు ఉన్నాయన్న వాదనల నేపధ్యంలో నోటీసులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.