క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడంలో సినిమా వాళ్లు ముందే ఉంటారు. అది తప్పు కూడా కాదు. విజయ్ దేవరకొండ… అనతి కాలంలోనే ఓ బ్రాండ్ గా మారిపోయాడు. `రౌడీ` పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్ ని స్థాపించాడు. ఓ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీలో భాగస్వామిగానూ మారాడు. ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు… ఆనంద్ దేవరకొండ కూడా పయనిస్తున్నాడు.
ఇటీవల `మిడిల్ క్లాస్ మెలోడీస్`తో.. ఆకట్టుకున్నాడు ఆనంద్. ఇప్పుడు ఆ సినిమా పారితోషికంతో.. ఓ బిజినెస్ కూడా మొదలెట్టేశాడు. తన స్నేహితులతో కలిసి `గుడ్ వైబ్స్ కేఫ్` ప్రారంభించాడు. తన సినిమాలో బొంబాయి చెట్నీని ఫేమస్ చేసిన ఆనంద్.. ఇప్పుడు నిజ జీవితంలో నిజంగానే కాఫీని అమ్మబోతున్నాడన్నమాట. యువ హీరోలు ఇలా వ్యాపారంలోకి అడుగుపెట్టడం కొత్తేంకాదు. ఎప్పటి నుంచో ఉంది. సందీప్ కిషన్ `వివాహ భోజనంబు` రెస్టారెంట్ ని దిగ్విజయంగా నడుపుతున్నాడు. ఈ జనరేషన్ అంతా ఫుడ్ బిజినెస్‌పై దృష్టి పెట్టడం, ఆనంద్ కూడా… దానికి సంబంధించిన వ్యాపారంలోనే అడుగుపెట్టడం విశేషం.