గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టో గ్రేటర్ రేంజ్ ను దాటి.. రాష్ట్రం.. దేశం వరకూ పయనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో గ్రేటర్లో నీటి పన్ను రద్దు దగ్గర్నుంచి రాష్ట్ర అంశాల వరకూ టచ్ చేసింది. తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. బహుశా.. గ్రేటర్లో గెలిపిస్తే చేస్తారు కావొచ్చు అని ఓటర్లు అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌తో సంబంధం లేని.. రాష్ట్ర స్థాయి హామీలన్నీ ఇచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. జాతీయ స్థాయి అంశాలను బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ప్రత్యేకంగా పిలిపించి.. మేనిఫెస్టో రిలీజ్ చేయించారు బీజేపీ నేతలు. అందులో గ్రేటర్ కార్పొరేషన్ అధికారాల పరిధిని మించి.. హామీలు గుప్పించింది.
బీజేపీ ఇచ్చిన హామీల్లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ కూడా ఉంది. వరదల్లో నష్టపోయిన వారికి 25 వేలు సాయం , ఎల్ఆర్ఎస్ను రద్దు చేయడం, హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం హై క్వాలిటీ వైఫై, లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాజ్ యోజన ఇళ్లు, బడి పిల్లలందరికీ ఉచితంగా ట్యాబ్‌లు వంటి చేతికి ఎముక లేని హమీలున్నాయి. అలాగే.. మూసీ ప్రక్షాళన 10 వేల కోట్లు, వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పునరుద్ధరణ, ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తిపన్ను రద్దు, 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్లు అవసరం లేని రూల్, ప్రజలందరికీ ఉచిత మంచి నీరు హామీలు ఇచ్చారు. అలాగే.. పేదలకు 100 యానిట్ల వరకు ఉచితంగా విద్యుత్ హామీ ఇచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గొప్పగా ఇచ్చిన చలాన్లను జీహెచ్ఎంసీనే కట్టుకునే హామీ మాత్రం.. మ్యానిఫెస్టోలో కనిపించలేదు. అలాంటి పథకం పెట్టడం సాధ్యం కాదనుకున్నారేమో కానీ.. వదిలేశారు. గ్రేటర్లో అన్ని పార్టీలు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని.. వారు విడుదల చేసిన మేనిఫెస్టోలతోనే అర్థమైపోతుంది. జీహెచ్ఎంసీ అనేది ఓ స్థానిక సంస్థ. కానీ జాతీయ స్థాయి హామీలు ఇవ్వడమే దీనికి నిదర్శనం. అన్ని పార్టీలదీ అదే బాట కావడంతో.. ఓటర్లకు అందరూ అందరే అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.