ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుళ్ళూరు మండలంలో వెలగపూడి వద్ద నిర్మించ తలబెట్టిన తాత్కాలిక సచివాలయ భవన సముదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 8.23 గంటలకు శంఖుస్థాపన చేయబోతున్నారు. దాని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు నిన్న సాయంత్రానికే పూర్తి చేసారు. చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి వెలగపూడికి ఉదయం 8గంటలకు చేరుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని చాలా నిరాడంబరంగా నిర్వహించబోతున్నారు. కొందరు మంత్రులు, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శంఖుస్థాపన అనంతరం ఎటువంటి సభాకార్యక్రమాలను కూడా జరుపడం లేదు. ఈ కార్యక్రమానికి హాజరయిన స్థానిక ప్రజలను ఉద్దేశ్యించి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు మాట్లాడవచ్చును.
ఈ తాత్కాలిక సచివాలయంలో రెండు బ్లాకులను ఎల్ అండ్ టి ఒక బ్లాకును షాపూర్ జీ పల్లోం జి సంస్థలు నిర్మించబోతున్నాయి. తాత్కాలిక సచివాలయ భవనాలను 27.082 ఎకరాలలో నిర్మిస్తారు. 18.047 ఎకరాలలో పార్కింగ్ కోసం కేటాయించారు. మొత్తం 45.129 ఎకరాలలో నిర్మిస్తారు. మొత్తం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మించబడుతుంది. అందులోనే శాసనసభ సమావేశాల నిర్వహించుకొనేందుకు వీలుగా విశాలమయిన సమావేశ మందిరం కూడా ఉంటుంది.
ఈ తాత్కాలిక సచివాలయం గుంటూరుకి 40 కిమీ, మంగళగిరికి 12కిమీ, విజయవాడకి 12కిమీ దూరంలో ఉంటుంది. సీడ్ క్యాపిటల్ కి కేవలం 2కిమీ దూరంలో ఉంటుంది. ఈ తాత్కాలిక సచివాలయ నిర్మాణం మొత్తం ప్రీ-ఫ్యాబ్రికేటడ్ పద్దతిలో నిర్మిస్తారు కనుక నాలుగు నుండి ఆరు నెలలలోగా నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.