గ్రేటర్లో ప్రచారం హోరెత్తుతోంది. భారతీయ జనతా పార్టీ తరపున స్మృతి ఇరానీ నుంచి అమిత్ షా వరకూ అందరూ వస్తున్నారు. మోడీ మాత్రం ఎందుకు రావడం లేదు.. ఆయనను కూడా పిలిపించవచ్చు కదా టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేశారు. వారు సీరియస్‌గా తీసుకున్నారో లేదో కానీ.. నిజంగానే మోడీ హైదరాబాద్ వస్తున్నారు. ప్రచారానికి ఆఖరి రోజు అయిన 29వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు. కానీ ఇక్కట ట్విస్ట్ ఉంది. ప్రధాని వచ్చేది గ్రేటర్ ప్రచారానికి కాదు. హైదరాబాద్ శివార్లలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి ఐదు గంటలకు తిరుగు పయనం కానున్నారు.
భారత్ బయోటెక్ .. కోవాగ్జిన్ పేరుతో.. కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి పరుస్తోంది. ఇప్పటికే మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. అరవై శాతానికిపైగా సమర్థత నిరూపించుకుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ తరుణంలో.. అత్యవసర అనుమతులు ఇచ్చి అయినా.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే..మోడీ భారత్ బయోటెక్‌ను సందర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోడీ రాక ఆసక్తికరంగా మారింది. మోడీ పర్యటన మొదటగా పుణెలో ఉంటుందనుకున్నారు. కానీ.. అనూహ్యంగా హైదరాబాద్‌కు మారింది. హైదరాబాద్ ఎన్నికలపై మోడీ పర్యటన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా.. రోజుకొకరు చొప్పున హైదరాబాద్ వస్తున్నారు. బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే వారంతా.. పార్టీ తరపునే వస్తున్నారు. కానీ ప్రధానమంత్రి మాత్రం.. అధికారిక పర్యటనకు వస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ వచ్చిన రోజునే.. అమిత్ షా కూడా.. హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తారు.