హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని భావించిన ధర్మాసనం.. తెలంగాణ హెల్త్ డైరక్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కరోనా విషయంలో తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని .. అనేక సార్లు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో..రోజుకు 50 వేల కరోనా టెస్ట్‌లు చేయాలని ఆదేశించింది. అయితే తెలంగాణ హెల్త్ డైరక్టర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరి కదా.. తాజా విచారణలో అవసరం ఉన్నప్పుడు రోజుకు 50 వేల టెస్టులు చేస్తామని చెప్పుకొచ్చింది.
దీనిపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని వ్యాఖ్యానించింది. అందుకే హెల్త్ డైరక్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ.. ఎన్నికల తర్వాత కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని.. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదని ఆక్షేపించింది. కరోనా విషయంలో ప్రభుత్వ తీరుపై.. హైకోర్టు మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. కరోనా ఉద్ధృతంగా ఉన్నప్పటి నుంచి టెస్టులు అత్యధికంగా చేయాలని ఒత్తిడి చేస్తూనే ఉంది.
కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ తీరుపై వరుసగా పిటిషన్లు దాఖలవుతూ వచ్చాయి. వాటిపై విచారణలో .. హైకోర్టు హెచ్చరిస్తూనే ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. రాజకీయ నాయకులు బాధ్యులు కారు. అధికారులే బాధ్యులవుతారు. అందుకే.. హైకోర్టు హెల్త్ డైరక్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించింది.