ప్రభాస్ – రాజమౌళిల `ఛత్రపతి` ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ రీమేక్ బాధ్యతని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌కి అప్పగించారు. బెల్లంకొండని `అల్లుడు శ్రీను`తో పరిచయం చేసింది వినాయక్నే. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ బాధ్యతల్నీ తనపైనే వేసుకున్నాడు. జనవరి నుంచి ఈసినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. ఛత్రపతికి స్క్రిప్టు అందించిన విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు `ఛత్రపతి`లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌ని ఇప్పటి అభిరుచులకు అనుగుణంగా మారుస్తున్నారు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చేశాయి కూడా. ఈ నెలాఖరు లోగా స్క్రిప్టు లాక్ చేస్తారు. ఇతర కీలకమైన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.