అమరావతి నిర్మాణాలకు ఎంత ఖర్చయిందో హైకోర్టుకు చెప్పడానికి అకౌంటెంట్ జనరల్ సిద్ధపడలేదు. హైకోర్టు అడిగితే.. వివరాలు ఇచ్చే అధికారం తనకు లేదని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ తరపున హైకోర్టులో అఫిడవిట్ దాఖలయింది. అమరావతి పిటిషన్లపై విచారణలో భాగంగా హైకోర్టు.. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో.. ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలని అకౌంటెంట్ జనరల్‌ని ఆదేశించింది. అయితే.. రెండు, మూడు సార్లు గడువిచ్చినా సమర్పించలేదు. గత విచారణలో.. ఆ వివరాలన్నీ సమర్పించకపోతే అకౌంటెంట్ జనరల్‌ను హైకోర్టుకు పిలిపించాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరిచింది.
దీంతో.. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పేరుతో అపిఢవిట్ దాఖలు చేశారు. కేంద్రం వెచ్చించిన నిధులపై పార్లమెంట్ అడిగితే సమాచారం ఇస్తామని.. రాష్ట్రం మంజూరు చేసే నిధులపై శాసనసభ అడిగితే సమాచారం ఇస్తామని.. కానీ.. వ్యయం చేసే నిధుల వివరాలు ఇవ్వడానికి అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. కాగ్‌ది రాజ్యాంగ బద్ధ సంస్థ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ చెప్పుకొచ్చారు. అమరావతికి ఎంత ఖర్చయిందో చెప్పడానికి.. ప్రభుత్వం సిద్ధంగా లేదని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని అంటున్నారు. అమరావతి ఖర్చుపై ప్రభుత్వ పెద్దలు రకరకాలుగా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.
అదే సమయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును.. ప్రజా సంపదను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఎంత ఖర్చయిందో చెప్పడానికి ప్రభుత్వం తటపటాయిస్తోందని చెబుతున్నారు. కోర్టుకు వ్యయం వివరాలు అడిగే అధికారం లేదన్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ ప్రారంభమయింది.