గుజరాత్‌లోని సూరత్‌లో పీవీఎస్ శర్మ అనే మాజీ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్, బీజేపీ నేత, ప్రస్తుతం మీడియా కంపెనీ ఓనర్‌ను.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమాలు.. అవినీతికి పాల్పడిన చాలా మందిని ఈడీ అరెస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో పెద్దగా విశేషం ఉండదు. కానీ ఈ పీవీఎస్ శర్మ ఎప్పుడూ తనకూ బీజేపీ లీడర్ అనే ట్యాగ్ తగిలించుకుంటాడు. దాంతో బీజేపీ లీడర్ పీవీఎస్ శర్మ అనే బీజేపీ నేత అరెస్ట్ అనే విషయం హైలెట్ అయింది. అయితే ఇది నేషనల్ లెవల్లో. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి.. ఆయనకు మరింత ఫేమ్ వస్తోంది. దీనికి కారణం ఆయన తెలుగులో చేసిన ట్వీట్లే.
సూరత్‌లో సంకేత్ మీడియా అనే కంపెనీ పెట్టి గుజరాతీ, ఇంగ్లిష్‌లో న్యూస్ పేపర్లు నడుపుతున్న పీవీఎస్ శర్మ.. తెలుగులో ఎక్కువగా ట్వీట్లు చేస్తూంటారు. ఆయన తెలుగువాడేనని చెబుతూంటారు. ఉద్యోగరీత్యానో… బీజేపీలో ఉంటే మంచి అవకాశాలు ఉంటాయనో.. సూరత్‌లో స్థిరపడ్డారు. బీజేపీకి భజన చేయడం బాగా వచ్చు. అయితే.. గుజరాత్ లోనేనా.. మాతృగడ్డపై తన ఉనికి చాటుకోకూడదనుకుంటారేమో కానీ.. బీజేపీ వ్యతిరేకుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ పోస్టులు పెడుతూంటారు. ఇటీవల.. అమరావతి గురించి తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అందులో అవినీతి అంతా బయటకు వస్తుందని… టీడీపీ నేతలు జైలుకెళ్లబోతున్నారని వరుస ట్వీట్లు పెట్టారు.
శర్మకు జ్యోతిష్యం కూడా బాగా తెలుసులాగుంది… అక్టోబర్ ఏడో తేదీన జ్యోతిష శాస్త్రం ప్రకారం.. టీడీపీ నేతలు అరెస్టవుతున్నారని జ్యోతిష్యం చెప్పారు. ఆ రోజున ఎందుకు ట్వీట్ చేశారంటే.. ఏపీ సీఎం జగన్ మోడీతో భేటీ అయ్యారన్నమాట. అందుకే ఆయన అలా జ్యోతిష్యం చెప్పారు. అయితే శర్మ… వేరే వాళ్ల జ్యోతిష్యాలు చూశారు కానీ.. తన హస్త రేఖలు చూసుకోవడం మర్చిపోయినట్లున్నారు. ఎందుకంటే.. హఠాత్తుగా ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కస్టడీకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ చేసే ప్రక్రియలో ఆయనను సోదాలు చేయకుండా అడ్డు పడుతున్నారని ఇంటి నుంచి రోడ్డు మీదకు గెంటేశారు. ఫోన్ కూడా లాగేసుకున్నారు. దీంతో కాసేపు ధర్నా చేశారు. చివరికి అరెస్ట్ చేసి లోపలికి పంపించారు.
అవినీతి గురించి చాలా ట్వీట్లు చేసిన ఈ పీవీఎస్ శర్మ… మామూలుగా మనీలాండరింగ్ చేయడం లేదు. తనకు ఇంగ్లిష్, గుజరాతీ పేపర్లు ఉన్నాయని చెప్పుకుంటాడు. వాటి సర్క్యూలేషన్ .. పదుల్లో కూడా ఉండదు. కానీ వేలల్లో ఉందని చెప్పి.. గుజరాత్ ప్రభుత్వం దగ్గర.. ప్రైవేటు ఏజెన్సీల దగ్గర రూ. కోట్ల విలువ చేసే అడ్వర్ టైజ్మెంట్లు సేకరించాడు. అంతే కాదు.. ఆ మీడియా కంపెనీ పేరు చెప్పి పెద్ద ఎత్తున మనీలాండరింగ్ కి పాల్పడ్డాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో.. ఈడీ తేల్చనుంది.
అక్టోబర్ ఏడో తేదీన శర్మ ట్వీట్.. ఆ తర్వాత ఆయన అరెస్ట్.. అన్నీ చూసిన వాళ్లు.. బహుశా.. మోడీ అవినీతి ప్రక్షాళన.. ఆయన నుంచే ప్రారంభించారని సెటైర్లు వేస్తున్నారు. తమ అక్రమాలు.. అవినీతిని పట్టుకోకూడదని అధికార పార్టీ నేతలకు బాకా ఊదుతూ.. ప్రతిపక్ష నేతలపై రాళ్లేస్తే.. తనకు చట్టాలు వర్తించవనుకునే శర్మ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి టైమొస్తుందని శర్మలాంటి వాళ్ల ఉదాహరణలే అప్పుడప్పుడూ ఎదురవుతూ ఉంటాయి.