సలోని… ఈ పేరు విని చాలా కాలం అయ్యింది కదా..? రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో పడినా, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అప్పట్లో నాలుగైదు సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథలూ ఎంచుకుంది. కానీ లాభం లేకపోయింది. సలోనిని అంతా మర్చిపోయిన తరుణంలో.. ఆమెను ఇప్పుడు సునీల్ గుర్తు చేస్తున్నాడు.
సునీల్ కథానాయకుడిగా వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సలోనిని కథానాయికగా ఎంచుకున్నారు. `మర్యాద రామన్న` తరవాత.. సునీల్,సలోని జోడీ కడుతున్న సినిమా ఇదే. మర్యాద రామన్న సెంటిమెంట్ తనకు ఉపయోగపడుతుందని సలోనిని తీసుకున్నారో, లేదంటే.. ఈ క్యారెక్టర్ సలోనిని డిమాండ్ చేసిందో, అదీ కాదంటే.. హీరోయిన్లు ఎవరూ దొరక్క సలోనిపై ఆధారపడ్డారో తెలీదు గానీ, సుదీర్ఘ విరామం తరవాత.. సలోని మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్టైంది. మరి… ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మరి.