జగన్ శ్రేయోభిలాషిగా అందరికీ గుర్తుండే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలి కాలంలో ప్రెస్‌మీట్లు పెట్టి.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేస్తున్న తప్పులను కరెక్ట్ చేసి.. ఆయనకు మేలు చేద్దామన్న ఉద్దేశం ఆయనకు ఉండొచ్చేమో కానీ.. పదే పదే .. కేసులకు భయపడుతున్నారా.. అని వ్యాఖ్యానిస్తూండటం.. వైసీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. జగన్ నోరెత్తలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటో అందరికీ తెలుసు. కానీ ఉండవల్లికి మాత్రం అదేం తెలియనట్లుగా ఉండి. కేసులకు భయపడుతున్నారా అంటూ.. ప్రశ్నించడం ప్రారంభించారు.
ప్రధానంగా ఉండవల్లి అభ్యంతరాలు పోలవరం ప్రాజెక్ట్ గురించే వస్తున్నాయి. పోలవరం విషయంలో గత ప్రభుత్వాన్ని ఆయన ఏమీ అనడం లేదు. ప్రస్తుత ప్రభుత్వంపైనే విరుచుకుపడుతున్నారు. పోలవరంలో జరుగుతున్న గడబిడకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమని చెబుతూ వస్తున్నారు. అలా చెబుతున్న వాటిలో ఒక్కటంటే.. ఒక్క కారణం కూడా కరెక్టని.. ఉండవల్లి చెప్పడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించాల్సి ఉందని.. కానీ ఏపీ తీసుకుందనే వాదన వినిపిస్తున్నారు. కానీ ఉండవల్లి మాత్రం..గత ప్రభుత్వం తీసుకోలేదని చెబుతున్నారు. పోలవరం విషయంలో ఉండవల్లి సగటు ఆంధ్రుడిగానే మాట్లాడుతున్నట్లుగా భావిస్తున్నారు.
అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఉండవల్లి ఓ గొప్ప సలహా ఇచ్చారు. అదేమిటంటే.. నవరత్నాల హామీలను అమలు నిలిపివేయడం. నవరత్నాలను చూసి.. జగన్‌కు ఓట్లేయలేదట. కేవలం.. పోలవరం, ప్రత్యేకహోదా అంశాలను చూసే ఓట్లేశారని..అందుకే సంక్షేమం పేరుతో సంక్షోభం తెచ్చుకోవద్దని సలహాలిస్తున్నారు. అసలు ఉపాధే లేనప్పుడు.. సంక్షేమం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందు కోసం పిట్టకథలు చెప్పి.. ఆయన జగన్ మనసు మార్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే.. నవరత్నాలను అమలు నిలిపివేస్తే.. పోలవరం, ప్రత్యేకహోదా సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు అసాధ్యమని.. జగన్ సర్కార్ ఇప్పటికే చేతల్లో చూపిస్తోంది..మరి శ్రేయోభిలాషి సలహాపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!