కరోనాను ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్ అనే వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తోంది. అందులో భాగంగా… లక్షణాలు ఉన్న వారిని.. వారి కాంటాక్టులను ఎవరినీ వదలకుండా… టెస్టులు చేస్తూ వెళ్తోంది. ఓ సందర్భంలో రోజుకు 70వేలకుపైగా టెస్టులు చేసింది. తాజాగా కేసులు తగ్గడంతకో .. టెస్టుల సంఖ్య కూడా తగ్గినప్పటికీ… మొత్తంగా కోటి సంఖ్యను దాటేసింది. ఆదివారం నాటికి ఏపీలో కోటి 17వేల 126 శాంపిల్స్ పరీక్షలు చేశారు. మొత్తంగా పాజిటివ్ రేటు 8.66 శాతంగా నమోదయింది. కరోనా విజృంభించడం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఏపీలో 8,67,683 కరోనా కేసులు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
టెస్టుల విషయంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ మాత్రం.. ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో పని చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి.. అందరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్దేశించారు. అయితే.. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా లక్షణాలు ఉన్న వారికి.. వారి కాంటాక్టులకు మాత్రమే టెస్టింగ్ చేయాలి. ఆ ప్రకారమే ముందుకెళ్లారు. కోటి టెస్టుల ఫలితం ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటికీ ఏపీలో ఆ జాడ లేదు. క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.
ప్రపంచం మొత్తం.. టెస్టింగ్ మీదనే ప్రధానంగా దృష్టి పెట్టింది. లక్షణాలు లేని వైరస్ సోకిన వ్యక్తుల ద్వారానే.. ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతోంది. అలాంటి వారిని గుర్తించడమే కీలకం. వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఆపితే.. వైరస్ వ్యాప్తి చాలా వరకు ఆగిపోతుంది. వైరస్ నెమ్మదించిన తర్వాత చాలా రాష్ట్రాలు నిర్లక్ష్యం చేయడంతో ఇలాంటి వారు పెద్ద ఎత్తున జన సమూహాల్లో కలిసిపోయారు. ఇతరులకు అంటించారు. ఫలితంగా.. దేశంలోసెకండ్ వేవ్ ప్రారంభమయింది. కానీ కోటి టెస్టుల ఏపీలో ఆ భయం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.