ఢిల్లీ దద్దరిల్లిపోతోంది. లక్షలాదిగా తరలి వచ్చిన రైతులతో ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోతున్నాయి. ఎన్ని నిర్బంధాలు పెట్టినా వారు వెనక్కి తగ్గడం లేదు. షరతులు పెట్టి.. చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమయింది. కానీ వారు మాత్రం షరతులకు అంగీకరించే ప్రశ్నే లేదంటున్నారు. వారందరూ ఒకే ఒక్క డిమాండ్ వినిపిస్తున్నారు.. అదే కొత్తగా చేసిన వ్యవసాయ చట్టాల రద్దు. నిజానికి ఢిల్లీని ముట్టడించిన రైతుల్లో అత్యధికం పంజాబ్ రైతులే. దేశం మొత్తానికి వర్తించేలా కేంద్రం చట్టం చేసింది. తమ బతుకును.. జీవనాన్ని లాగేసుకుంటున్నారన్న ఆందోళనతో… పంజాబ్ రైతులు ఆందోళన చేస్తూంటే… ఇతర రాష్ట్రాల రైతుల్లో ఎందుకు స్పందన కనిపించడంలేదనేది ఆశ్చర్యకరంగా మారింది.
వాస్తవానికి ఒక్క పంజాబ్ రైతులు మాత్రమే కాదు.. హర్యానా, యూపీలో వరి, గోధుమలు పండించే రైతులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కానీ ఎక్కువ మంది కాదు. పంజాబ్లో కనీస మద్దతు ధర ఇచ్చి పంటలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. హర్యానాలోనూ అంతే. అంటే… ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో అమ్మేది తక్కువే. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని.. కొత్త చట్టాలు చాన్స్ ఇచ్చాయి. కానీ దళారులు తమను దోచుకుంటారని రైతులు వాపోతున్నారు. ఈ చట్టాల కారణంగా .. కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు నిలిపివేస్తుందని ఆందోళన చెందుతున్నారు. దానికి తగ్గట్లుగానే కొత్త చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అందుకే వారు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతుల వద్దకే వెళ్లి కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తే.. రైతులకు మరో ఆప్షన్ లేకుండా వారికే అమ్ముకునే పరిస్థితులు కల్పిస్తే.. ఇక దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. రైతులకు పావలా అందిస్తే.. మార్కెట్ కు వచ్చే సరికి పదిరూపాయలు అవుతుంది. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం వైపు నుంచి సాయం అందదు. పంజాబ్ తోపాటు ఉత్తరాదిలోని కొంత మంది రైతులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారంటే.. చట్టాలపై వారికి అవగాహన ఏర్పడటమే కారణం అని చెప్పుకోవచ్చు. దక్షిణాదిలో .. వ్యవసాయ మార్కెటింగ్ విధానం కొంత మార్పు ఉంటుంది. ఈ కారణంగా ఆ చట్టాలు తమపై పెద్దగా ప్రభావం చూపవన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే… దక్షిణాదిలో రైతులు పెద్దగా నిరసన తెలుపడం లేదు. ఆ చట్టాలపై విస్తృతమైన చర్చ జరగలేదు. జరిగిన తర్వాత రైతుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది.