తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య 2013లో టీఆర్ఎస్లో చేరారు… కానీ ఆయనకు కమ్యూనిస్టు నేతగానే గుర్తింపు ఉంది. విద్యార్థి ఉద్యమాల నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ లీడర్‌గా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. సీపీఎం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. కెరీర్ పరంగా ఆయన న్యాయవాదిగా వ్యవహరించేవారు.
నల్గొండ జిల్లాలో ప్రముఖ లాయర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. నకిరేకల్ మండల పరిషత్ ఛైర్మన్‌గా రెండు సార్లు గెలిచారు. నకిరేకల్ నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 1999, 2004 ఎన్నికల్లో గెలిచి సీపీఎం తరపున ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. శాసనసభలో అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేవారు. మంచి వాగ్ధాటితో అధికారపక్షంపై విరుచుకుపడేవారు. అయితే.. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీతో గ్యాప్ వచ్చింది. ఇతర పార్టీల నేతలతో సరిపడకపోవడంతో.. ఆయన 2013లో టీఆర్ఎస్లో చేరారు. మొదటి సారి ఎంపీ సీటు నుండి పోటీ చేసి ఓడిపోయారు.
గత ముందస్తు ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జానారెడ్డిపై ఏడు వేల ఓట్లతేడాతో గెలుపొందారు. రెండేళ్లలోపే అనూహ్యంగా కన్నుమూశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరో ప్రముఖ నేత అంతర్థానం అయినట్లయింది. ఇటీవలే టీఆర్ఎస్కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోయారు. ఆయన స్థానంలో ఉపఎన్నిక జరిగింది. నాగార్జున సాగర్ స్థానానికి కూడా ఆరు నెలల్లో ఉపఎన్నిక జరగాల్సి ఉంటుంది.