చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!?
భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు ఉద్యోగాలు.. స్వయం ఉపాధి పొందిన వారు.. చదువులేని వాళ్లు.. కొద్దిగా చదువుకునన్న వాళ్లు అందరూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ మెట్రో సిటీల్లో మాత్రం ఓటు పర్సంటేజీ ఎప్పుడూ యాభై శాతానికి మించదు. అదీ కూడా.. గ్రేటర్ కార్పొరేషన్ లాంటి ఎన్నికలయితే ఇంకా తగ్గుతుంది. ఎందుకిలా..? అన్నీ తెలిసిన వాళ్లు ఉండే సిటీలో ఓటర్లు ఎందుకు ఓటు వేయరు..?
హైదరాబాద్‌లోని ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల్లో ఎక్కువమంది ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. ఎన్నికలు జరిగే ప్రతిసారి బస్తీలు, మురికివాడలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. బస్తీల్లో 63 నుంచి 65 శాతం ఓటింగ్ నమోదవుతోంది. ఇక్కడివారు తప్పకుండా ఓట్లు వేస్తారని అభ్యర్థులు సైతం ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. కాలనీల్లో ఆ మాత్రం టింగ్ జరగడం లేదు. పోలింగ్ శాతం తగ్గడానికి డూప్లికేట్, మృతుల పేర్లను తొలగించకపోవడమూ కారణమనే వాదనలు ఉన్నా… ఇటీవలి కాలంలో అలాంటి వాటిని భారీగా తొలగించారు.
ఎవరూ మన రాత మార్చరు.. మన రాత మనమే రాసుకోవాలి. మన ఓటు ద్వారా మన రాత రాసుకోవాలి. ఎవరు వచ్చినా అంతే అనే నిర్లిప్తతతో ఉంటే మొదటికే మోసం వస్తుంది. అన్ని అంశాలు బేరీజు వేసుకుని.. పాలకుల్ని ఎంపిక చేసుకుంటే… ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం లభిస్తుంది. లేకపోతే.. దేశానికి నష్టం చేసినట్లవుతుంది. అందుకే.. హైదరాబాదీ లెట్స్ ఓట్..!