ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. నిమ్మగడ్డ ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారని కానీ.. సాధ్యం కాదని.. ఆయనకు ఆదేశాలివ్వాలని.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ చేసిన ప్రకటన ఏకపక్షంగా ఉందని ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించాలని భావించినప్పుడు ఎన్నికల కమిషన్ ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీంకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చిందని ఆయినా నిమ్మగడ్డ పట్టించుకోలేదని ద్వివేదీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో వాయిదా వేసినప్పుడు కూడా నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సహకరించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే నిమ్మగడ్డకు ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదు. రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నా వద్దని స్పష్టం చేసింది. దీంతో నిమ్మగడ్డ ఈ అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం అంత కంటే ముందుగానే హైకోర్టును ఆశ్రయించి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. సీఎస్ లేఖలు కోర్టు ధిక్కరణ అవుతాయన్న అంచనాతో.. అధికార యంత్రాంగం అంతా కోవిడ్ వైరస్ నియంత్రణలో నిమగ్నమైందని.. ఈ దశలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారని కవర్ చేసుకునే ప్రయత్నం కూడా పిటిషన్లో ఉంది.
కరోనా పరిస్థితిని .. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం .. తన పిటిషన్లో చతెప్పుకుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రచారం సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తారని, ఓటేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు వస్తారని.. అందు కరోనా పెరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అందుకే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆపేయాలని కోరారు.