ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దిశ బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశ పెడుతోంది. ఏడాది కిందట చట్టంచేసి కేంద్రానికి పంపినా.. ఆమోదం లభించలేదు. ఈ బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని చెబుతూ.. చట్టాన్ని కేంద్రం వెనక్కి పంపింది. తెలంగాణలో దిశ ఘటన జరిగిన తర్వాత ఏపీలో హుటాహుటిన బిల్లు ఆమోదించేసి.. ఢిల్లీకి పంపిన ఏపీ సర్కార్.. ఆ బిల్లును కేంద్రం ఆమోదం పొందకుండానే అమలు చేయడం ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్లు కూడా పెట్టారు. కానీ కేంద్ర, న్యాయ, శాసన వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమశాఖ, హోంశాఖ పరిధిలోని మహిళా విభాగాలకు బిల్లు వెళ్లింది. అన్ని శాఖలు.. ఆ బిల్లులో చాలా లోపాలున్నాయని… వెనక్కి పంపాయి. అనేక సవరణల సూచిస్తూ కేంద్రం తిరిగి ఏపీకి బిల్లును పంపింది.
దిశ చట్టం ప్రకారం అత్యాచారం చేస్తే 21 రోజుల్లో ఉరి శిక్ష విధిస్తారు. దీనిపై.. న్యాయనిపుణులు ఎన్నో సందేహాలు లెవనెత్తారు. కానీ అందరిపైనా.. రాజకీయ విమర్శలతో విరుచుకుపడిన.. వైసీపీ సర్కార్.. తాను అనుకున్నట్లుగా బిల్లు చేసింది. ప్రభుత్వ పెద్దల ఫోటోలను..పార్టీ కార్యకర్తలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు. దిశ చట్టం అమలులో ఉందన్న అభిప్రాయాన్ని కల్పించారు. చివరికి బిల్లు వెనక్కి వచ్చింది. ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లను… సవరిస్తున్నట్లుగా దిశ చట్టంలో పేర్కొన్నారు. ఓ కేంద్ర చట్టాన్ని… కేంద్ర పరిధిలో ఉండే.. ఐపీసీ, సీఆర్పీసీని.. ఓ రాష్ట్రం మార్చడం సాధ్యమా..? అంటే సాధ్యం కాదనే అందరూ చెబుతారు. అయితే ప్రభ్వం మాత్రం మొండిగా బిల్లును ఢిల్లీకి పంపింది. ఏడాది తర్వాత తిరిగి వచ్చింది. అందుకే సవరణతో మళ్లీ అసెంబ్లీ ఆమోదం తీసుకోబోతున్నారు.
ఏపీలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగితే దిశ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హోంమంత్రి కూడా చెబుతూంటారు. చట్టం లేకుడా ఎలా చర్యలు తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. విజయవాడలో యువతిని దారుణంగా హత్య చేసిన నాగేంద్రబాబు.. విశాఖలో మరో ఉన్మాది విషయంలో వారం రోజుల్లో చార్జిషీట్ వేస్తామని పోలీసులు, హోంమంత్రి ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఎలాంటి ముందడుగు వేయలేపోయారు. ఇప్పుడు దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. ఆ తర్వాత అమలు చేయడం ప్రారంభించవచ్చు.