కెప్టెన్ కుర్చీలో కూర్చోవాలన్న ఆశ చాలామంది హీరోలకు ఉంది. అందులో సునీల్ ఒకడు. సునీల్ కి ఎప్పటి నుంచో మెగాఫోన్ పై గురి. తన సినిమాలకు కొత్త దర్శకుల్ని ఎంచుకునేది.. దర్శకత్వ ప్రతిభనీ చూపించేసుకోవడానికే అని, తన సినిమాలకు సునీల్ తెర వెనుక దర్శకుడని చాలామంది చెబుతుంటారు కూడా. ఎట్టకేలకు సునీల్ తన కల నెరవేర్చుకోబోతున్నాడని టాక్.
సునీల్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఓ మరాఠీ సినిమా హక్కుల్ని సునీల్ కొనుగోలు చేశాడని, ఈ సినిమాతోనే.. సునీల్ దర్శకుడిగా అడుగుపెట్టబోతున్నాని టాక్. ఈ సినిమాలో హీరో కూడా తనే. సునీల్ కి ఓ నిర్మాత కూడా దొరికేశాడని సమాచారం. ప్రస్తుతం వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సునీల్. ఇది ఓటీటీ కోసమే తీస్తున్న సినిమా. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. సలోనీ కథానాయికగా నటిస్తోంది. అన్నట్టు.. ఈ సినిమా కూడా రీమేకే.