దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. అది అసెంబ్లీ అయినా… మున్సిపల్ ఎన్నిక అయినా.. బీజేపీ మేనిఫెస్టోలో మొట్ట మొదట కనిపిస్తునన హామీ అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యాక్సిన్ హామీ రాజకీయ వివాదాంశం అయింది. గ్రేటర్ ఎన్నికల్లోనూ మేనిఫెస్టోలో అదే పెట్టారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వచ్చేస్తోంది… ఇక పంపిణీకి సిద్ధం కావాలని ప్రభుత్వ యంత్రాగాల్ని పరుగులు పెట్టిస్తోంది. వ్యాక్సిన్ తయారీ ఎక్కడిదాకా వచ్చిందో.. ల్యాబుల్లోకి వెళ్లి ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించి వస్తున్నారు. ఇలాంటి సమయంలో… కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదనేదే ఆ ప్రకటన.దేశ ప్రజలందరికీ టీకా వేయాల్సిన అవసరముందని ప్రభుత్వం ఎప్పుడూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది.
వైరస్ వ్యాప్తి ఆపడమే వైరస్ ప్రధాన ఉద్దేశమని… అందుకే అవసరమైన వారికి టీకా ఇస్తే చాలని.. ఐసీఎంఆర్ చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. అది సామాన్య ప్రజల వరకూ రాదన్న అంచనాలు వస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా.. ముందుగా సమాజంలో పలుకుబడి ఉన్న వారు టీకాలు వేయించుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అంటే.. సమాజంలో టీకా అవసరమైన కేటగరిలో వారు ముందు ఉంటారు.
తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కో గలిగిన వాళ్లు ఉంటారు. చిట్ట చివరన సామాన్యులు ఉంటారు. వారి వరకూ వ్యాక్సిన్ ఉంటే.. అప్పుడు పంపిణీ చేస్తారేమో..? ప్రస్తుతం టీకాకు అన్ని అనుమతులు వచ్చినా… ఉత్పత్తి అంత తేలిక కాదు కాబట్టి… ప్రజలందరికీ అందించడం అసాధ్యమే. కానీ.. రాజకీయం కోసం ఇప్పటికే..టీకా ఫ్రీ అంటూ.. ప్రచారం ప్రారంభించేశారు. చాలా చోట్ల .. ప్రజలు ఓట్లు కూడా వేశారు. ఇప్పుడు దేశ ప్రజలందరికీ అవసరం లేదనే కొత్త వాదనను అధికార వర్గాల ద్వారా తీసుకొచ్చారు. అంటే.. వ్యాక్సిన్ కోసం సామాన్యులు ఎదురు చూడాల్సిందే..!