ఆసీస్ పర్యటనలో భారత్ కి తొలి విజయం. వరుసగా రెండు భారీ ఓటములు మూటగట్టుకుని వన్డే సిరీస్ ని కోల్పోయిన టీమ్ ఇండియా.. మూడో వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకుంది. ఆసీస్‌పై 13 పరుగుల తేడాతో విజయం అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. 92 పరుగులు చేసిన పాండ్యా టాప్ స్కోరర్. జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. పాండ్యా, జడేజాలు కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌లో ఈ భాగస్వామ్యమే హైలెట్.
303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటింగ్‌లో ఆరోన్ ఫించ్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 59 పరగులతో రాణించాడు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీలు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. జట్టు స్కోరు 268 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన ఆస్టన్ అగర్ అవుట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇక బౌలింగ్‌లో శార్ధూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్ 2 వికెట్లు, బుమ్రా, జడేజా, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు.