పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అంచనాల తగ్గింపు … తప్పిదం మొత్తం చంద్రబాబుదేనని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా 2014 అంచనాల ప్రకారం.. కేంద్రం ఇస్తానంటే చంద్రబాబు సరేనని అంగీకరించారని..అరుణ్ జైట్లీకి సంబరాలు చేశారని ఆయన చెప్పారు. ఇప్పుడు.. చంద్రబాబు చేసిన తప్పులను తాము కరెక్ట్ చేస్తున్నామని .. దేవుడిదయ వల్ల కేంద్రం కూడా సహకరిస్తోందని జగన్ సంతోషం వ్యక్తం చేశారు. 2022 ఖరీప్ కల్లా.. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందిస్తామని ప్రకటించారు. అధికారం చేపట్టిన మొదట్లో 2020 అన్నారు.. కొద్ది రోజుల కిందట.. 2021 అన్నారు.. ఇప్పుడు అసెంబ్లీలో 2022 అన్నారు. కేంద్రం సవరించిన అంచనాలను కాకుండా.. మొత్తం ఇస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
వాస్తవానికి పోలవరం అంచనాలను చంద్రబాబు విపరీతంగా పెంచాడనేదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ. తెలుగుదేశం పార్టీ హయాంలో అంచనాల తగ్గింపు అనే మాటే ఎక్కడా వినిపించలేదు. రూ. 55వేల కోట్లకు అంచనాలు అంగీకరించాలని ప్రతిపాదనలు పంపితే.. జగన్మోహన్ రెడ్డి.. కేంద్రానికి అదే పనిగా లేఖలు రాశారు. అంత మొత్తం అంగీకరిస్తే.. అది అవినీతి కోసమేనని ఆయన ఆరోపించారు. జగన్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారు. ఆ అంచనాలను చూపే.. చంద్రబాబు ఎంత పెద్ద అవినీతికి పాల్పడుతున్నారో ఊహించవచ్చని చెప్పుకొచ్చారు.
అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ వాదన రివర్స్ అయింది. చంద్రబాబు హయాంలో వేసిన అంచనాలనే ఆమోదించాలని పట్టుబట్టారు. టెక్నికల్ కమిటీ అంచనాలను ఆమోదించినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ఘనత అని వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. సాక్షి మీడియా కూడా చెప్పింది. అప్పుడు కూడా.. చంద్రబాబు 2014 అంచనాలకు ఒప్పుకున్నారని.. అయినా కేంద్రం అడగకుండానే ఉదారంగా.. 2019 ధరల ప్రకారం అంచనాలు ఇచ్చిందని చెప్పలేదు. కానీ కేంద్రం మదిలో ఎందుకు..అలాంటి ఆలోచన వచ్చిందో కానీ.. హఠాత్తుగా టెక్నికల్ కమిటీ ఆమోదాన్ని కూడా పక్కన పెట్టేసి.. 2014 ధరలను ఇస్తామని తేల్చేసింది. గట్టిగా అడగలేని ఏపీ సర్కార్.. ఇదంతా చంద్రబాబు వల్లేనని ఎదురుదాడి ప్రారంభించింది.
అప్పట్లో అంచనాలు పెంచేశారని వాదించిన జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు ఇప్పుడు అంచనాలను తగ్గించారని విమర్శించడం ప్రారంభించారు. వాటికి అంగీకరించారని చెబుతున్నారు. మొత్తానికి ఒకే రాజకీయ నాయకుడు.. అధికారం అందక ముందు.. అధికారం అందిన తర్వాత వేర్వేరుగా మాట్లాడుతూంటారు. జగన్ కూడా అంతే. కాకపోతే.. ఆయన తాను అంచనాలు అవినీతి కోసం పెంచారని చెప్పలేదన్నట్లుగా తగ్గించారని గతంలోనే చెప్పానన్నట్లుగా అసెంబ్లీలోనే వాదించడం… ఆసక్తికరం.