గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చివరికి 46.55 శాతంగా నమోదు అయినట్లుగా ఎస్‌ఈసీ ప్రకటించింది. ఇది తక్కువేమీ కాదు. గ్రేటర్ ఎన్నికల్లో గత ఇరవై ఏళ్లలో నమోదయిన పోలింగ్ కంటే అత్యధికం. ఓ వైపు కరోనా ప్రభావం..మరోవైపు వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్.. వరుస సెలవులు.. అన్నింటికీ మించి.. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపని మున్సిపల్ ఎన్నిక., అయినప్పటికీ.. ఓటర్లు… 46 శాతానికిపైగా ఓట్లేశారంటే.. మరీ తీసి కట్టేం కాదనేది నిపుణుల విశ్లేషణ. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు.. అంత ఓటింగ్ ఎలా జరిగిందనే అనుమానాలు కూడా రాజకీయ పార్టీల్లో ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై రకరకాల చర్చలు ప్రారంభించారు.
ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లోఈవీఎంలు ఉపయోగించలేదు. బ్యాలెట్లు మాత్రమే వాడారు. పోలింగ్ పర్సంటేజీ విషయంలో ప్రతీ గంటకు ఎస్‌ఈసీ అప్ డేట్ ఇచ్చింది. మధ్యాహ్నం వరకూ ఇరవై శాతం కూడా నమోదు కాలేదు. సాయంత్రం ఐదు గంటల వరకు 35 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లుగా తేల్చారు. చివరి గంటలో మాత్రం దాదాపు పది శాతం పోలింగ్ నమోదయిందని నిర్ధారించారు. ఇదే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే.. ఐదు గంటల తర్వాత ఏ పోలింగ్ బూత్‌లోనూ ఓటర్లు కనిపించలేదు. సాధారణంగా ఆరు గంటలకుకూడా క్యూలైన్లు ఉంటే… పోలింగ్ శాతం పెరుగుతుందని అనుకోవచ్చు. కానీ.. గ్రేటర్‌లో అసలు ఎక్కడా ఎలాంటి క్యూలే కనిపించలేదు. దాంతో ఏకంగా పది శాతం పోలింగ్ ఎలా జరుగుతుందనేది చాలా మందికి అర్థం కావడం లేదు.
ఈవీఎంలు అయితే.. రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ బ్యాలెట్లు అయితే.. చివరి గంటలో పోలింగ్ సిబ్బంది సాయంతో.. ఏజెంట్లు చేసుకోవాలన్నది చేసుకోవచ్చు. ఎన్ని ఓట్లు ఉంటే.. అన్ని గుద్దేసి బ్యాలెట్ బాక్సుల్లో వేసి.. ఓటర్లు ఓట్లు వేశారని రాసుకోవచ్చు. ఇప్పుడు అదే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా పోలింగ్ బూతుల్లో ఇతర పార్టీల ఏజెంట్లను ఐదు గంటల కల్లాపంపేశారని.. అధికార పార్టీ ఏజెంట్లే ఉన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా.. చివరిగంటలో పదిశాతం పోలింగ్ అయిందంటే.. అది ఖచ్చితంగా ఓటర్లు వేసినవి కాదన్న అభిప్రాయం మాత్రం… రాజకీయ పార్టీలలో ప్రారంభమయింది.