కేంద్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని వెనక్కి పంపడంతో.. దాన్ని ఉపసంహరించుకుని కొత్త బిల్లును మళ్లీ ప్రవేశ పెట్టింది ఏపీ సర్కార్. ఆ బిల్లులో… ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకున్న హైలెట్స్ ఏమీ లేవు. పాలాభిషేకాలు చేయించుకున్న శిక్షలు లేవు. గడువు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. దిశ చట్టం సాదాసీదాగా ఉంది. ఆ చట్టం కింద ప్రత్యేకంగా కేసులు పెట్టడం కూడా సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే.. అది అసలు చట్టమే కాదు. కొత్త బిల్లులో చట్టం అనే పదం కూడా తీసేశారు.
తెలంగాణలో దిశ ఘటన జరగగానే ఏపీలో జగన్ ఆవేశ పడ్డారు. 21 రోజుల్లో విచారణ పూర్తి, ఉరి శిక్ష అంటూ హడావుడి చేశారు. అసెంబ్లీలో చట్టం అంటూ బిల్లు తెచ్చారు. దాన్ని కేంద్రానికి పంపారు. ఇప్పుడు… దాన్ని ఉపసంహరించుకుని కొత్త బిల్లు తెచ్చారు. ఆ బిల్లు లక్ష్యం…మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడమే. 21 రోజుల్లోనే శిక్షలు వేస్తామన్న హామీలు కొత్త బిల్లులో లేవు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి బిల్లులు అక్కర్లేదు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఉపసంహరించుకునన బిల్లులో 14 రోజుల్లో కోర్టుల్లో విచారణ.. 21 రోజుల్లో శిక్ష ఖరారు అని ఉంది. అలాగే వివిధ చట్టాల్లోని సెక్షన్లను మార్చారు. కొత్త చట్టంలో .. నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం, ఐపీసీ-1860, సీపీసీ-1973ల పరిధిలోనే కేసుల నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత న్యాయమూర్తుల నియామకానికి వారికి సౌకర్యాల గురించి ప్రస్తావించారు. ఎక్కడా చట్టాల గురించి ప్రస్తావించలేదు.
ఉపసంహరించుకున్న దిశ బిల్లు.. ఇప్పుడు రెండో సారి పెట్టిన దిశ బిల్లుకు అసలు పొంతన లేదు. ఒక్క దిశ పేరు మాత్రమే ఉంది. ఈచట్టం వల్ల ప్రత్యేక కోర్టులు మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ చట్టం చెల్లదని మొదటి నుంచి రాజ్యాంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా ఏ మాత్రం అవగాహన లేకుండా ఏపీ సర్కార్.. వాటిని తయారు చేసి .. ఆమోదించేసి పంపేసింది. పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేయించుకున్నారు. దిశ చట్టం అమల్లోకి వచ్చిందనే భ్రమలను కల్పించారు. చివరికి నవ్వుల పాలవ్వాల్సి వచ్చింది. అదే దిశ చట్టాన్ని కోర్టులు కొట్టి వేసి ఉంటే… న్యాయవ్యవస్థపై ఏ స్థాయి దాడి చేసేవారో ఊహించడం కష్టం. పంపింది కేంద్రం కాబట్టి.. కేంద్రంపై చంద్రబాబు లేదా కుల మద్ర వేయడానికి సాహసించలేకపోయారు.