స్వస్తిక్ గుర్తు లేకపోయినా.. పెన్నుతో గీకినా ఓటు చెల్లుబాటు అవుతుందంటూ..ఎస్ఈసీ ఇచ్చిన సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్విస్తిక్ గుర్తు కాకుండా.. ఇతర ఏ గుర్తులు బ్యాలెట్లపై ఉన్నా… ఆలాంటి ఫలితాలను కోర్టు ఉత్తర్వులకు లోబడి విడుదల చేయాలని ఆదేశించింది. అర్థరాత్రి ఎస్ఈసీ నుంచి వివాదాస్పదమైన సర్క్యూలర్ రావడంతో.. వెంటనే బీజేపీ నేతలు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయమే విచారణ జరిపిన హైకోర్టు… ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కోర్టు తీర్పును బట్టి స్వస్తిక్ గుర్తు ఉంటేనే… ఓటు చెల్లుబాటు అవుతుంది.
కారణం ఏమిటో కానీ.. ఎస్ఈసీ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. పెన్నుతో ఓటు వేయడం అనేది ఎప్పుడూ లేదు. అలాంటి ఓట్లు ఎప్పుడూ చెల్లవు. పోలింగ్ అధికారి ఇచ్చిన స్వస్తిక్ గుర్తు ను… అభ్యర్థి గుర్తుపై .. ముద్రవేసినప్పుడు మాత్రమే ఓటు చెల్లుతుంది. పెన్నుల్లాంటివి ఓటు వేయడానికి ఉపయోగించరాదు. అయితే.. అలా చేయడం తప్పని చెప్పినప్పటికీ.. ఓటు చెల్లుబాటవుతుందనే ఉత్తర్వులు ఎస్ఈసీ ఇచ్చింది. ఇది రిగ్గింగ్‌ను ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి ఇచ్చిన ఉత్తర్వులని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. హుటాహుటిన కోర్టుకెళ్లాయి.
ప్రస్తుతానికి ఓట్ల లెక్కింపులో పెన్నుతో గీసిన ఓట్లు చెల్లవు. స్విస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. అయితే పెన్నుతో గీసిన ఓట్లు ఎన్ని ఉంటాయో విడిగా లెక్కించి ఉంచుతారు. మెజార్టీ కన్నా ఎక్కువ ఉంటే… కోర్టు తీర్పు మేరకు.,. నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే.. పెన్నులతో ఓట్లేయాలి అని ఓటర్లకు తెలియదు. అలా ఎక్కువ మంది వేసే అవకాశం కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కౌంటింగ్ రోజు… పెన్ను మార్క్ ట్విస్ట్ రావడం… ఉత్కంఠకు కారణం అవుతోంది.