తెలుగుదేశం పార్టీ హయాంలో మీడియా సలహాదారుగా పని చేసి.. మధ్యలోనే వైదొలిగిన పరకాల ప్రభాకర్ ప్రస్తుతం..ఓ టీవీ చానల్ బాధ్యతలు చూస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆయన ఆ ఒక్క బాధ్యతతోనే సరి పెట్టుకోలేదు. అమరావతి విషాదాన్ని ప్రజల ముందు ఉంచడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను ఆయన విడుదల చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తెలియని పరిస్థితిలో ఉందని.. ఎందుకీ దుస్థితి..? ఎవరిదీ నేరం..? అనే అంశాలను బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఆయన చాలా పరిశోధన చేసి.. అన్ని అంశాలను వెల్లడించబోతున్నారని ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
పరకాల ప్రభాకర్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. అయితే.. ఆయన ఆమె నీడ పడకుండానే స్వతంత్రంగా పరకాల వ్యవహరిస్తూ ఉంటారు. గతంలో ఆయన బీజేపీలో పని చేసినప్పటికీ.., తర్వాత ఏపీ బీజేపీ నేతల తీరు సరిపడక పార్టీ నుంచి వైదొలిగారు. స్వతంత్రంగా కెరీర్ కొనసాగిస్తున్నారు. టీడీపీ హయాంలో మీడియా సలహాదారుగా చాలా కాలం పని చేశారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో అందరి అభిప్రాయాలను సేకరించడంలో పరకాల కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీజేపీతో టీడీపీ కటిఫ్ చెప్పడం… జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడంతో పరకాల పదవి నుంచి వైదొలిగారు. చంద్రబాబు చెప్పినా ఉండటానికి అంగీకరించలేదు.
ఇప్పుడు అమరావతి విషయంలో ఆయన ఆవేదన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. అమరావతి విషాదాన్ని రైతుల దుస్థితిని ప్రజల ముందు ఉంచడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే అమరావతి విషయంలో అసలు నిజాల కన్నా… అబద్దాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. ప్రజల్లోఓ అభిప్రాయం కల్పించి అదే నిజమని భ్రమ కల్పించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని పటాపంచలు చేసేందుకు పరకాల ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. ఆయన వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు.