వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని చూసుకుంటున్న విజయసాయిరెడ్డి… ఆ విభాగంలో కార్యకర్తలకు ఉద్యోగాలివ్వాలనుకుంటున్నారు. పనీ పాటా లేకుండా…పార్టీ నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తూ… సోషల్ మీడియా పోస్టుల్ని వైరల్ చేయడం వల్ల వారికి ఉపాధి లేకుండా పోతుందని ఆయన బాధపడుతున్నారేమో కానీ.. కనీసం రెండు వేల మందికి అయినా ఉద్యోగాలిప్పించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాకార్యకర్తలకే నేరుగా చెప్పారు. విశాఖలో ఆత్మీయ సమావేశం నిర్వహించి.. ఉద్యోగాల భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడినా తమకు ఎలాంటి ప్రయోజనం లభించడం లేదని.. చాలా మందితీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారన్న సమాచారం మేరకు.. వారందర్నీ… బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి ఆత్మీయ సమావేశాలు పెట్టారు.
రాయలసీమ నుంచి గుంటూరు వరకూ.. కార్యకర్తలకు తాడేపల్లిలో విందు ఇచ్చారు. హిత బోధ చేసి పంపారు. ఇప్పుడు విశాఖలో నిర్వహించారు. ఉత్తరాంధ్ర సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలాంటి సాయం చేయాలో ఆలోచించి చివరికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించుకున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరుగా..అందుకే.. ఎక్కడెక్కడ ఉద్యోగాలిస్తామో.. ఎలాంటి ఉద్యోగాలిస్తామో కూడా చెప్పుకొచ్చారు. విశాఖ ఫార్మాసిటీలో… కొన్ని వేల ఖాళీలు ఉన్నాయని… వాటికి… ఎంపిక చేస్తామని భరోసా ఇచ్చారు. దాని కోసం ట్రైనింగ్ కూడా ఇస్తామన్నారు. అంతేనా.. ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చారు.
ఇప్పటికే వాలంటర్ పోస్టులు.. సచివాలయపోస్టులు 90 శాతం మన పార్టీ వారికే ఇచ్చామని విజయసాయిరెడ్డి ఘనంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు… ప్రైవేటు సంస్థల్లోనూ.. తమ వారికే.. సోషల్ మీడియా కార్యకర్తలకే పోస్టులుఇస్తామని ప్రకటించుకుంటున్నారు. అటు ప్రభుత్వం అయినా.. ఇటు ప్రైవేటు రంగం అయినా ఏపీలో ఎదైనా ఉద్యోగం భర్తీ చేయాలంటే.. అది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. కార్యకర్తలతోనే అన్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటనలు చేసేస్తున్నారు.