ఆసీస్తో వన్డే సిరీస్ ని కోల్పోయిన భారత్…. టీ 20లో శుభారంభం చేసింది. ఈరోజు కాన్బెర్రాలో జరిగిన తొలి టీ 20 మ్యాచ్లో 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ.. రాహుల్ 51 పరుగుల తేడాతో రాణించాడు.చివర్లో జడేజా చెలరేగి 23 బంతుల్లో 44 పరుగులు చేసి, ఆదుకోడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఓపెనర్లు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం ఇచ్చినా, ఆ తరవాత భారత బౌలర్లు కట్టుదిట్టమౌన బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ముఖ్యంగా తొలి టీ20 ఆడుతున్న నటరాజన్ 30 పరుగులకు 3 వికెట్లు తీసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చాహల్ కి మూడు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జడేజా గాయపడడంతో… అతని స్థానంలో కండీషన్ సబ్స్ట్యూట్గా చాహల్ బౌలింగ్ కి దిగాడు. రెండో టీ 20 ఆదివారం జరగనుంది.