పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగించాలని పార్టీ హైకమాండ్ ఎప్పుడో డిసైడయింది. హుజూర్ నగర్ లో ఓడిపోయినప్పుడే.. ఆయన వద్ద రాజీనామా లే్ఖ తీసుకున్నారు. కానీ.. పీసీసీ చీఫ్ పోస్టు కోసం.. భట్టి, కోమటిరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంటి వారు ప్రయత్నించారు. ఎవరికైతే పోస్ట్ రాకపోతే… వారెళ్లి ఇతర పార్టీల్లో చేరిపోతామని బ్లాక్ మెయిలింగ్ చేశారు.
అదే సమయంలో.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయనను అడ్డుకోవడానికి సీనియర్లు చేయని ప్రయత్నం లేదు. ఆయనకు పదవి కల్పిస్తారని ప్రచారం జరిగినప్పుడల్లా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఓ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపేసింది. ఇదంతా.. కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్గత సహకారం వల్లేనని గుసగుసలు కూడా ఉన్నాయి. కర్ణాటకలో పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ ను ప్రకటించినప్పుడు.. రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రకటించాల్సింది. కానీ.. ఆగిపోయారు.
చివరికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తి స్థాయిలో దిగజారిపోయిన తర్వాత.. ఉత్తమ్ రాజీనామా చేశారు. ఇప్పుడు… పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే.. మొత్తం కాంగ్రెస్ పనైపోయినా… కొంత మంది సీనియర్లు మాత్రం… తమ తీరు మార్చుకోరు. మొత్తం పార్టీని పడుకోబెట్టేసిన తర్వాత రేవంత్ కు పగ్గాలిస్తే.. ఆయన మాత్రం ఏం చేయగలగుతారు..?