ప్రపంచం మొత్తం.. కరోనా భయంతో వణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్రకంపనలు కాస్త తగ్గాయి గానీ, కరోనా వ్యాపించిన కొత్తలో… ఈ వైరస్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అసలు మనిషి మనుగడని, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని ప్రశ్నార్థకం చేసిన వైరస్ ఇది. కరోనా తరవాత ప్రజల మనస్తత్వాల్లో, ఆలోచనా విధానంలో కాస్త మార్పు వచ్చింది. వైరస్ లు ఎలా పుడతాయి? ఎలా వ్యాప్తి చెందుతాయి? వాటిని ఎలా అరికట్టొచ్చు? అనే విషయాల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. అయితే.. వైరస్ లు ప్రబలడం ఇదే కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి వైరస్ లు దాడి చేశాయి. అందులో నిఫా వైరస్ ఒకటి. నిఫా వైరస్ నేపథ్యంలో మలయాళంలో తీసిన సినిమా `నిఫా వైరస్`. ఇప్పుడిది తెలుగులో డబ్ అయ్యింది. `ఆహా`లో ప్రదర్శితమవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటి పరిస్థితులకు ఎంత వరకూ అద్దం పడుతుంది?
కేరళలోని ఓ ఆసుపత్రి నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ ఆసుపత్రిలో చేరిన ఓ రోగి… అనూహ్యంగా మరణిస్తాడు. 23 ఏళ్ల యువకుడు కేవలం జ్వరంతో మరణించడం ఆసుపత్రి వర్గాల్ని, వైద్యుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. కొత్త సందేహాల్ని రేకెత్తిస్తుంది. అయితే మరో షాక్ ఏమిటంటే.. ఆ రోగికి చికిత్స అందించిన నర్స్ కూడా అదే వ్యాధి బారిన పడుతుంది. రోగికి… నిఫా వైరస్ సోకిందన్న విషయం అర్థం అవుతుంది. ఆ వైరస్ త్వర త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఓ పక్క… ఆ వైరస్ కి విరుగుడు కనిపెట్టడం, నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిమగ్నమైతే, మరోవైపు ఆసుపత్రిలో రోగులకు సేవలు చేస్తున్న వైద్యుల సాధక బాధకాలు నడుస్తుంటాయి. చివరికి ఈ వైరస్ ని ఎలా అరికట్టారు? అందులో ఎవరి పాత్ర ఎంత? అన్నదే మిగిలిన కథ.
మలయాళంలో ఈ కథని తీయడానికి ఓ కారణం ఉంది. నిఫా వైరస్ కేరళలో ఎక్కువగా విజృంభించింది. అక్కడ చాలామంది ఈ వైరస్ బారీన పడి చనిపోయారు. ఓ దశలో ఈ వైరస్ ప్రభావంతో కేరళ చాలా ఇబ్బంది పడింది. ఆ తరవాత.. కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో వైరస్ క్రమంగా మరుగున పడిపోయింది. అందుకే… ఈ కథ సినిమా గా మారింది.
నిఫా వైరస్ నాటి పరిస్థితులకూ, కరోనా నాటి పరిస్థితులకు పెద్ద తేడా కనిపించదు. అప్పటికీ ఇప్పటికీ.. ఒకటే భయం. ఓ వైరస్ వచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఎలా భయపడతారు? పేషెంట్లను సంపూర్ఱ ఆరోగ్యవంతులుగా మార్చడంలో వైద్యుల పాత్ర ఏమిటి? అన్నవి అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది. కాబట్టి.. ఈ కథకు త్వరగా కనెక్ట్ అవుతారు. నిజానికి కరోనాకి ముందు కథ ఇది. కానీ ఇప్పుడు మరింత బాగా కనెక్ట్ అవుతారు. ఆసుపత్రి నేపథ్యంలోనే ఎక్కువ సన్నివేశాలు నడుస్తాయి. అక్కడికి వచ్చే పేషెంట్లని డాక్టర్లు ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ల సాధక బాధకాలేంటి? అనే విషయాల్ని చాలా సహజంగా తెరకెక్కించారు. అయితే ఆయా సన్నివేశాల్ని చూడడం కాస్త కష్టమే. గాయాల బారీన పడిన పేషెంట్లు, వాంతులు చేసుకుంటున్న వైనం.. వెండి తెరపై చూడలేం.
మలయాళ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే.. తమ కథలకు ఎలాంటి నటులు కావాలో వాళ్లనే ఎంచుకుంటుంటారు దర్శకులు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. దాదాపు నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వాళ్లెక్కడా నటిస్తున్నట్టు అనిపించదు. రేవతి తప్ప.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటులెవరూ ఉండరు. కథని ఫాలో అయిపోతే, పాత్రలూ… దగ్గరైపోతాయి. ఇలాంటి కథల్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. సబ్జెక్ట్ ని లోతుగా స్టడీ చేయాలి. దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అయితే.. నిడివి విషయంలో ఒకసారి ఆలోచించుకోవాల్సింది. కత్తెరకు పదును పెడితే.. బాగుండేది. కెమెరా, నేపథ్య సంగీతం మూడ్ ని బాగా ఎలివేట్ చేశాయి. డబ్బింగ్ క్వాలిటీ సరిగా లేదు. కొన్ని పాత్రలకు గొంతులు మ్యాచ్ కాలేదు.
ఈ కథలో రెండు కోణాలున్నాయి. ఒకటి వైరస్ అయితే.. రెండోది సమాజం పెట్టే ఇబ్బంది. తమ ప్రాణాలకు తెగించి, రోగుల్ని వైద్యులు కాపాడితే.. వాళ్లని సైతం సమాజం అంటరానివాళ్లుగా చూడడం నిజంగా బాధిస్తుంది. ఆసుపత్రిలో వైద్యులు ఎంత కష్టపడతారు? వాళ్ల కుటుంబ జీవనాన్ని, ప్రాణాల్ని ఎలా త్యాగం చేస్తారు? అనేది క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేశారు. ఓరకంగా ఈ సినిమా చూశాక వైద్యులపై గౌరవం మరింత పెరుగుతుంది. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో… సాగదీత ఎక్కువగా కనిపిస్తుంది. ఇదో మెడికల్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు. జనాల సాధక బాధకాలు తెరపై చూడ్డం కూడా ఎందుకు? అనుకుంటే.. ఈ సినిమా చూడ్డం పక్కన పెట్టొచ్చు. ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందిస్తుంది? ప్రజల పాత్రేమిటి? అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.