జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనూహ్యంగా గణనీయమైన స్థానాలు సాధించిన బిజెపి పార్టీకి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. అదే సమయంలో జన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు వీరిరువురి మధ్య గ్యాప్ ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో, వీరిరువురి పరస్పర అభినందనలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే..
బండి సంజయ్ ట్వీట్ చేస్తూ, “బల్దియా ఎన్నికల్లో ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ చేస్తామని చెప్పాం కానీ… ‘ సాఫ్రాన్ స్ట్రైక్ ‘ చేశాం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ‘ సన్ స్ట్రోక్ ‘… కమలానికి ‘ సన్ రైజ్ ‘ అయింది. బిజెపికి మద్దతునిచ్చిన భాగ్యనగర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తెలంగాణలో అవినీతి, అరాచక పాలన సాగుతోంది. ప్రజలకు న్యాయం చేసేందుకు బిజెపి జాతీయ నాయకత్వం అండగా నిలిచింది. మమ్మల్ని ప్రోత్సహించిన పెద్దలకు, కష్టపడి పనిచేసిన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచి, బిజెపిని విజయతీరాలకు చేర్చిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి మరియు జన సైన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ మద్దతు మా అభ్యర్థులకు గొప్ప స్థైర్యాన్ని ఇచ్చింది. మోడీ గారి నాయకత్వానికి, మాకు మీరు అందిస్తున్న సహకారం వెలగట్టలేనిది.” అని రాసుకొచ్చారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచి, బిజెపిని విజయతీరాలకు చేర్చిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి మరియు జన సైన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 4, 2020
మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా పోరాడి విజయం సాధించిన బిజెపి టీంకు అభినందనలు తెలియజేశారు. వారి వ్యూహ రచనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అదే సమయంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని జనసేన నిర్ణయించుకున్నాక తమ భవిష్యత్తును పక్కనపెట్టి మరీ నామినేషన్ విరమించుకున్న చేసుకున్న జనసేన అభ్యర్థులను గుర్తుంచుకుని మరీ అభినందించారు.
కేవలం 0.25% ఓట్ల టిఆర్ఎస్ కంటే తక్కువ సాధించిన బిజెపి, జనసేన పార్టీని సమన్వయం చేయడంలో మరికొంత చొరవ చూపించి ఉంటే, టిఆర్ఎస్ ఇప్పుడు ప్రధానంగా గెలుచుకున్న సీమాంధ్ర ప్రాంతాలలో కూడా బిజెపి మరి కొన్ని సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించి ఉండేది అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఏదేమైనా బిజెపి జనసేన ల మధ్య గ్యాప్ కరిగిపోయినట్లుగా ఈ పరిణామం సూచిస్తోంది.