భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న టీకాను.. ప్రయోగాత్మకంగా వేసుకున్న వాలంటీర్లలో ఒకరైన హర్యానా ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత నెల ఇరవై ఎనిమిదిన ఆయనకు మొదటి డోస్ టీకా వేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న దశలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. దీంతో కోవాగ్జిన్ టీకాపై చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు వేసుకున్న తర్వాత పధ్నాలుగు రోజులకు .. యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయని భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. అనిల్ విజ్.. ఒక్క సారి మాత్రమే టీకా డోస్ తీసుకున్నారని రెండో డోస్.. మొదటి డోస్ తీసుకున్న తర్వాత నెల రోజులకు ఇస్తామని.. కానీ దురదృష్టవశాత్తూ.. అనిల్ విజ్ ఈ లోపే.. కరోనా బారిన పడ్డారని భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.. కరోనాను తరిమికొట్టవచ్చని కేంద్రం కూడా.. ఆశాభావంతో ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. భారత్ బయోటెక్ కు వచ్చి చూసి వెళ్లారు. వ్యాక్సిన్ పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ బయోటెక్ ఇప్పటికే రెండు విడతల ప్రయోగాలు పూర్తి చేసింది. మూడో విడత చేస్తోంది. ఇప్పటి వరకూ అరవై శాతానికిపై సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ ఉందని భారత్ బయోటెక్ చెబుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. వ్యాక్సిన్‌కు అన్ని అనుమతులు రావాలంటే.. కనీసం యాభై శాతం సామర్థ్యం ఉండాలి. వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఇలాంటి వార్తలు బయటకు వచ్చే కొద్దీ.. ఆ వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు ప్రారంభమవుతాయి. అంటే… కోవాగ్జిన్ ప్రభావంపై ఇక ముందు ఇంకా ఎక్కువ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత్ బయోటెక్ మరింత ఒత్తిడికి గురి కానుంది.