విశాఖలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ లీకయినప్పుడు అక్కడి ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. వాకింగ్ చేస్తున్నప్పుడు.. అలా రోడ్డుపై పడిపోయారు. ఇళ్ల ముందు పనులు చేసుకుంటున్న వారు కూడా… స్పృహ తప్పి పడిపోయారు. అలాంటి పరిస్థితులే శనివారం ఏలూరులో కనిపించాయి. పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు.. స్పృహతప్పి పడిపోవడం ప్రారంభించారు. వారి ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించింది. అయితే.. ఎలాంటి పరిశ్రమల కాలుష్యం విడుదలైనట్లుగా లేకపోవడంతో… ఇలాంటి కేసులు వందల కొద్దీ బయటకు వచ్చిన తర్వాతే వెలుగులోకి వచ్చాయి. ఏలూరుకు వరుస పెట్టి ఆస్పత్రికి పోటెత్తుతున్న స్పృహతప్పే కేసులను చూసి.. మీడియా హైలెట్ చేయడంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది.
బాధితుల్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి … అన్ని రకాల పరీక్షలు చేసి.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏలూరు స్వయంగా వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని నియోజకవర్గం కావడంతో ఆయన కూడా రంగంలోకి దిగారు. ఆస్పత్రుల్ని పరిశీలించి.. బాధితుల్ని పరామర్శించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. బాధితుల్ని విజయవాడ తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. మెరుగ్గా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. అసలు.. ప్రజలకు ఈ ఆరోగ్య ఇబ్బంది ఎందుకొచ్చిందన్నదానిపై… మాత్రం అధికారులు నోరు విప్పలేకపోతున్నారు.
ప్రజలకు ఇలా ఒకే సారి అనారోగ్యం వచ్చిందంటే..దానికి ప్రధాన కారణంగా అందరూ రోజు వారీగా ఉపయోగించే నీరు, ఆహారం వంటి వాటి ద్వారానే వస్తుందని ప్రాథమికంగా నిర్ణయించుకుని ఆ మేరకు.. దర్యాప్తు ప్రారంభించారు. బాధిత ప్రజలందరూ.. మినరల్ వాటర్ కొనుక్కుని తాగే స్థోమత లేని వాళ్లే. మున్సిపల్ వాటర్‌ను ఫిల్టర్ కూడా చేసుకోకుండా తాగుతారు. ఈ వాటర్ కాలుష్యం వల్లనే… వారికి అస్వస్థత వచ్చిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. అస్వస్థతకు గురైన వారి శాంపిల్స్ సేకరించి.. అసలు వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో నీటి శాంపిల్స్‌ను కూడా ల్యాబ్‌కు పంపిస్తున్నారు.
ప్రజలసేవ పట్ల.. ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటోందని… విమర్శలు పెరిగిపోతున్న సమయంలో.. సాక్షాత్తూ వైద్య ఆరోగ్య మంత్రి నియోజకవర్గంలోనే ఇలా జరగడం కామన్‌గా మారిపోతోంది. సమస్యను పరిష్కరించకుండా.. రాజకీయ ఆరోపణలు చేసుకుని.. ఎప్పటికప్పుడు… విషయాన్ని పక్కదారి పట్టించి… టైం పాస్ చేసేస్తున్నారు. ఈ సారి అలా చేయకుండా.. సమస్యను గుర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరింత మంది వ్యాధి బారిన పడకుండా కాపాడాలని కోరుకుంటున్నారు.