పునాదులు కదిలిపోయాయి..! పార్టీ కొన ఊపిరికి వచ్చింది..! అయినప్పటికీ..తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రాలేదు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం నేనంటే నేనని మీడియాకు ఎక్కుతున్నారు. బలంగా ఉన్న పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. డిపాజిట్లు రాని పార్టీగా మార్చేశారు. ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టని.. కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టిబొమ్మలు దగ్దం చేసుకునేంత వరకూ పరిస్థితి వచ్చింది. గ్రేటర్‌లోనూ పార్టీ పరిస్థితి అయిపోయిందనిపించిన తర్వాత ఆయన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపారు. ఇప్పుడు కూడా.. పార్టీ హైకమాండ్ ఎవర్ని చీఫ్ గా నియమిస్తే.. వారి ఆధ్వర్యంలో పని చేసి పార్టీని కాపాడుకుందామనుకున్న ఆలోచన పార్టీ నేతలు చేయడంలేదు.
పీసీసీ పోస్టు కోసం రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేశారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తాము రేసులో ఉన్నామంటున్నారు. పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి పీసీసీ కోసం రాజకీయం చేస్తోంది. భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల, వి.హెచ్ వంటి వారంతా పార్టీలో మొదటి నుండి పనిచేస్తోన్న వారికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని హై కమాండ్ ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. షబ్బీర్ అలీ, మల్లు రవి, బలరాం నాయక్ వంటి నేతలు రేవంత్ పీసీసీ కావాలని బలంగా కోరుకుంటున్నారు. అధిష్టానం సైతం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అందుకే రేవంత్ తప్పా ఎవరైనా ఒకే అన్న వాదనతో సీనియర్లు రచ్చ ప్రారంభించారు.
ఇప్పటికే రేవంత్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ హై కమాండ్ సీనియర్లు మీడియాకు ఎక్కడాన్ని కూడా సీరియస్‌గానే తీసుకుంటోంది. పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం ఎవర్నీ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందరూ టీఆర్ఎస్కు అమ్ముడుపోయిన వారేనని… ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం నిఖార్సుగా పని చేస్తున్నారన్న చర్చ మాత్రం జరుగుతోంది. రేవంత్ ను అడ్డుకోవడం కోసం…. పార్టీలో జరుగుతున్నప్రయత్నాలు.. చూసి..ఇక పార్టీ బతికి బట్టకట్టదనే అభిప్రాయాన్ని కూడా కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.