తెలంగాణ సీఎం కేసీఆర్ ఎనిమిదో తేదీన రైతులు తలపెట్టిన భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలందరూ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయని ఆయన మొదటి నుంచి వాదిస్తున్నారు. అదే సమయంలో రాజకీయంగానూ భారతీయ జనతా పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ఉండటంతో.. రైతుల ఆందోళనలను బేస్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్న ఏకైక డిమాండ్‌తో.. రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. లక్షల మంది రైతులు ఢిల్లీ శివార్లో ఉన్నారు. కేంద్రంతో చర్చలు ఆశాజనకంగా సాగకపోవడంతో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భారత్ బంద్ చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం.. కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ బంద్‌కు మద్దతు పలుకుతున్నాయి. అయితే ప్రత్యక్షంగా పాల్గొనడంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఢిల్లీలోఆందోళన చేస్తున్న ప్రధానంగా పంజాబ్, హర్యానాకు చెందిన వారు.
ఇప్పుడు యూపీ రైతులు కూడా వచ్చి చేరుతున్నారు. మెల్లగా ఇది దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్న కేసీఆర్ త్వరలో.. బీజేపీని వ్యతిరేకించే పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతుతో బీజేపీపై పోరాటాన్ని ప్రారంభించినట్లేనని అనుకోవచ్చుంటున్నారు.