ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. టీ 20 సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈరోజు సిడ్నీలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ పై ఆరు వికెట్ల తేడాతో జయ కేతనం ఎగరేసింది. దాంతో టీ 20 భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ.. ఆసీస్ కి బ్యాటింగ్ అప్పగించాడు. తొలి ఓవర్ నుంచే జోరు చూపించిన ఆసీస్ బ్యాట్స్ మెన్ నిర్ణీత 20 ఓవర్లకు 194 పరుగులు చేసి, భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచారు.
భారత ఓపెనర్లు రాహుల్ (30), ధావన్ (52) శుభారంభం అందించడంతో…. పరుగుల వేట ధాటిగానే ప్రారంభమైంది. వీరిద్దరూ తొలి వికెట్ కి 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. కోహ్లీ (22 బంతుల్లో 42) కూడా రాణించడంతో.. భారత్ సులభంగానే టార్గెట్ అందుకుంటుందనిపించింది. అయితే స్వల్ప వ్యవధిలో కీలకమైన వికెట్లు కోల్పోవడంతో.. భారత్ పై ఒత్తిడి పెరిగింది. అయితే… సూపర్ ఫామ్ లో ఉన్న పాండ్య (22 బంతుల్లో 42) మరోసారి విజృంభించడంతో మరో రెండు బంతులు ఉండగానే.. విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లలో 14 పరుగులు కావల్సివచ్చినప్పుడు పాండ్యా రెండు సిక్సులు బాది.. భారత్ కు విజయాన్ని అందించాడు.