మంత్రి కేటీఆర్ నోట.. జమిలీ ఎన్నికల మాట వచ్చింది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సిద్ధమయిందని.. మనం కూడా దానికి తగ్గట్లుగా సిద్ధం కావాలని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు తెలంగాణ భవన్లో కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యే్లతో మాట్లాడారు. ఫలితాలు అనుకున్నంతగా రాలేదని కంగారు పడాల్సిన పనేమీ లేదని.. గ్రేటర్లోఈ సారి భావోద్వేగ ఎన్నికలు జరిగాయన్నారు.
మన ప్రయత్నంలో లోపం లేదని అయితే.. మరింత మంది సిట్టింగ్లను మార్చాల్సి ఉందన్నారు. సిట్టింగ్లను మార్చిన దగ్గర గెలిచామన్నారు. ఇక్కడే మన లెక్క తప్పిందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని.. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఓడిన డివిజన్లలో ఓడిన వారే మన కార్పొరేటర్లు .. వారిని దూరం పెట్టకుండా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
కేటీఆర్ అప్పుడే వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడటంతో.. మంత్రులు, ఎణ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో కేంద్రం కూడా జమిలీ ఎన్నికల గురంచి మాట్లాడుతోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధం కావాలన్న ఆలోచనకు టీఆర్ఎస్ వచ్చినట్లుగా తెలుస్తోంది.