పౌరాణిక గాథలు తీయడం అంత ఈజీ కాదు. మేకింగ్ సంగతి అటుంచండి. అందులో పాత్రల్ని తీర్చిదిద్దే విధానంలో ఏ మాత్రం తేడా వచ్చినా, చాలామంది మనో భావాలు దెబ్బతింటాయి. ఎప్పుడు ఏ పాయింట్ ని పట్టుకుని `మా మనోభావాలు దెబ్బతిన్నాయోచ్..` అంటూ మీడియా ముందుకు రావడానికి సిద్ధపడే వర్గానికి… ఇంతకు మించిన తరుణం మరోటి దొరకదేమో..? బయోపిక్‌లలో దాదాపు 90 శాతం వివాదాలకు సిద్ధపడే తయారవుతుంటాయి. తాజాగా.. `ఆదిపురుష్` పై కూడా వివాదాలు మొదలయ్యాయి.
`ఆదిపురుష్` రామాయణ గాథ అన్నది అందరికీ తెలిసిందే. రామాయణంలో వివాదాస్పద అంశాలు పెద్దగా ఉండవు. కాకపోతే.. రావణుడి పాత్ర దగ్గరే అసలు పేచీ వస్తుంది. రావణుడి పాత్రని ఏమాత్రం పాజిటీవ్ గా చూపించినా, వివాదాలు చుట్టు ముడతాయి. `ఆదిపురుష్`లో రావణుడి పాత్ర ని పాజిటీవ్ గా చూపించబోతున్నారని, రామ,రావణ యుద్ధం సరైనదే అనే రీతిలో సన్నివేశాలుంటాయని సైఫ్ అలీ ఖాన్ ఈమధ్య నోరు జారాడు. దాంతో ఓ వర్గం భగ్గుమంది. రావణుడు రాక్షసుడని, ఆ పాత్రని పాలీష్ చేసి చూపించడం, రాముడి పాత్రని తగ్గించి చూపించడమే అని… విమర్శలు ఎక్కుపెట్టారు. దాంతో.. సైఫ్ అలీఖాన్ దిగి వచ్చాడు. తన మాటలు ఎవరి మనసైనా నొప్పించి ఉంటే క్షమించమని కోరాడు. అంతే కాదు.. రామాయణ గాథని తాము ఏమాత్రం వక్రీకరించడం లేదని, ఏ పాత్రనీ కించపరచకుండా సినిమాని తీస్తున్నామని చెప్పుకొచ్చాడు. సైఫ్ సవరణలతో ఎవరు ఎంత వరకూ సంతృప్తి పడతారో తెలీదు గానీ, `ఆదిపురుష్` ఇంకా మొదలు కాలేదు. ఇంతలోనే.. వివాదాలు మొదలైపోయాయన్నది వాస్తవం. మున్ముందు మరిన్ని విమర్శుల,నిందలు, ఆరోపణలు `ఆదిపురుష్` మోయాల్సి ఉంటుంది. అయినా సినిమా మొదలవ్వకముందే… ఆ సినిమా గురించిన లీకులు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు సారీలు చెప్పడమెందుకు? సైఫ్ అలీఖానే కాదు, ఆదిపురుష్ టీమ్ మొత్తం ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది.