ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ కి చాలా కారణాలున్నాయి. అప్పట్లో కొన్ని ఛానళ్లు.. చిరుకి వ్యతిరేకంగా పనిచేశాయి. చిరంజీవి చేసిన చిన్న చిన్న విషయాల్ని సైతం భూతద్దంలో పెట్టి చూపించాయి. ఓసారి.. అభిమానులకు కరచాలనం ఇచ్చిన వెంటనే, చిరు చేతికి శానిటైజర్ రాసుకోవడం తో ఛానళ్లు… ఆ దృశ్యంపై బాగా ఫోకస్ చేశాయి. ‘అభిమానులు అంటరానివాళ్లా?’ ఇలాంటి వాళ్లు ప్రజలకు సేవ ఏం చేస్తారు` అన్నట్టు కథనాలు ప్రసారం చేశాయి. దాంతో చిరు ఫ్యాన్స్ కూడా తమ హీరోపై అనుమానం గా చూశారు.
ఈ కథనం వెనుక అసలు నిజాన్ని ఇటీవల చిరు బయట పెట్టాడు. ఆరోజు తాను శానిటైజర్ వాడిన మాట వాస్తవమే అని, అయితే… ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, తనకెవరో ఖర్జూరం అందించారని, అది తినే ముందు… చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేశానని, అయితే… అదొక్కటీ ఎడిట్ చేసి, అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, శానిటైజర్ వాడడం, ఇవి మాత్రమే ఫోకస్ చేశారని, అభిమానులు అంటరాన్ని వాళ్లా? అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టారని, ఇది చక్కటి ఎడిటింగ్ నైపుణ్యానికి నిదర్శనమని.. సెటైర్ వేశాడు. ఇదంతా.. సీరియస్ గా, మీడియాపై కోపంతో చెప్పలేదు. సరదాగా.. గుర్తు చేసుకున్నారంతా. ఆ ఫుటేజీలన్నీ మీడియా హౌసుల్లో ఇంకా భద్రంగానే ఉన్నాయని, వాటిని బయటకు తీస్తే.. నిజానిజాలేమిటన్నది ప్రజలే తీర్పు చెబుతారని.. చిరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రజారాజ్యం సమయంలో తనపై పడిన నిందని చిరు ఈ రూపంలో చెరిపేసుకునే ప్రయత్నం చేశారు.