సిట్టింగ్లను మార్చిన చోట గెలిచాం.. మార్చని చోట ఓడిపోయాం…! ఆ తప్పు మళ్లీ చేదల్చుకోలేదు..! అని మంత్రి కేటీఆర్ … చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలకలం రేపుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 76 మంది సిట్టింగులకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది. 26 చోట్ల పాతవారిని మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కొత్తగా పోటీచేసిన కార్పొరేట్ అభ్యర్థుల్లో 24 మంది విజయం సాధించారు. పోటీ చేసిన సిట్టింగుల్లో మాత్రం మెజార్టీ స్థానాల్లో ఓడిపోయారు. సిట్టింగ్ కార్పొరేటర్ ల పై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయకుండా.. మెజారిటీ స్థానాల్లో మరో మారు వారికి పోటీ చేసే అవకాశం కల్పించడమే కొంప ముంచిందని కేటీఆర్ నిర్ణయానికి వచ్చారు.
గ్రేటర్ నేతలతోలో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించి ఎమ్మెల్యేలను, మంత్రులను హెచ్చరించారు ఇదే పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉంటుందని.. స్థానికంగా పరిస్థితులను చక్కదిద్దుకోవాలని హెచ్చరికలు పంపేశారు. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలకు తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే లు అందరికీ మరో మారు అవకాశం ఇచ్చారు. ఈ సారి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్టు కట్ చేయడం ఖాయమని సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ఆందోళనలో పడ్డారు. జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికలు 2022లో అవకాశం ఉందని అని కేటీఆర్ చెప్పడంతో ఎమ్మెల్యేల్లో మరింత ఆందోళన పెరిగింది.
నిజానికి 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం జరిగింది. అనేక మందిపై వ్యతిరేకత ఉండటంతో అలా చేస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగాఅందరికీ టిక్కెట్లిచ్చేసి.. ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం.. దాదాపుగా 70 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తారని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని బీజేపీ క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి… టీఆర్ఎస్లో అభద్రతలో ఉన్న వారిని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి.