ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు లభిస్తోంది. కార్మిక సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. బీజేపీ కూటమిలోని కొన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించి తీరాలనే అభిప్రాయమే అంతటా వినిపిస్తోంది. దేశం మొత్తం ఇప్పుడు రైతు కోసం.. భారత్ బంద్ అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో దేశం మొత్తం ఏకాభిప్రాయం వచ్చిన అంశం ఇదొక్కటేనని భావింవచ్చు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారిని ఏదో విధంగా బుజ్జగించందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.కానీ రైతులు దేనికీ అంగీకరిండం లేదు. వారు తమ ఏకైక డిమాండ్ మీదే ఉన్నారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని కొత్త చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలనే ఆలోచనలు చేస్తోంది. రైతులు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధం లేదు. మరోవైపు రైతుల ఆందోళనకు వివిధ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ‘భారత్ బంద్’కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించింది. అనేక మంది తమకు కేంద్రం ఇచ్చిన పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును వాపసు చేస్తానని బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించారు. మరికొంత మంది అదే బాటలోఉన్నారు.
రైతుల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్న వారిలో ఎక్కువగా పంజాబ్, హర్యానాతోపాటు.. కొంత మంది యూపీ రైతులే ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయచట్టాలపై పెద్దగా వ్యతిరేకత లేదు. రైతులు కూడాపట్టించుకోవడం లేదు. ఆ చట్టాలపై అవగాహన లేకపోవడం ఓ కారణం అయితే.. రాజకీయ పార్టీలేవీ.. కేంద్ర నిర్ణయాల్ని వ్యతిరేకించే స్థితిలో లేకపోవడం మరో కారణం. అయితే.. ఢిల్లీలో రైతులకు పెరుగుతున్న మద్దతు చూసి… దక్షిణాది రాష్ట్రాల్లోనూ కదలిక వస్తోంది. భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిన పరిస్థితి పార్టీలకు వస్తోంది. వ్యవసాయ చట్టాలు పేరుకు రైతులకు మేలు చేస్తాయని చెప్పినా.. అంతిమంగా కార్పొరేట్ చేతుల్లో రైతును పెట్టడానికి ఉపయోగపడతాయనేది అందరికీ ఆలస్యంగా అర్థమవుతున్న విషయం. అందుకే.. ఆ చట్టాలను ఉపసంహరించాలనే డిమాండే ఎక్కువగా వినిపిస్తోంది.