వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న రైతులు .. తమ నిరసనతో ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. ఎనిమిదో తేదీన భారత్‌కు బంద్‌కు రైతులు ఇచ్చిన పిలుపునకు అనూహ్యమైన స్పందన వచ్చింది. మద్దతు ఇచ్చేందుకు దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ముందుకు వచ్చాయి. అయితే ఈ సారి విశేషం ఏమిటంటే.. రైతులకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. సామాన్య ప్రజలే పెద్ద ఎత్తున రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఢిల్లీ శివార్లలో ఉన్న రైతులకు.. సామాన్యులే పెద్ద ఎత్తున ఆహారం.. ఇతర అవసరాలు తీరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు.. తమ భారత్ బంద్‌ను కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా నిర్వహించాలని నిర్ణయించారు.
మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి.. సాయంత్రం మూడు గంటల వరకే భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించామని.. ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనే తమకు లేదని.. రైతు సంఘాలు ప్రకటించాయి. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్ధతు పలికాయి. రైతు సంఘాల బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్ధతు పలికింది. రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేంద్రం చట్టాలు ఉపసంహరించుకునేంత వరకూ వెనుదిరిగిపోమని స్పష్టం చేస్తున్నాయి.
దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తమవుతుండటంతో… రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపై ట్రాక్టర్లు నిలిపి.. టెంట్లు వేసుకొని వంటావార్పు చేసుకుంటున్నారు. ఆందోళనలో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు.. శిబిరాలు ఏర్పాటు చేశారు. పలు చోట్ల పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.