తెలుగు సినీ నటీనటులకు `మా` ఉన్నట్టే.. తమిళ నటులకు `నడిగర్ సంఘం` ఉంది. అయితే… అక్కడ ఎప్పుడూ గొడవలే. రాజకీయాలకు తీసి పోని విధంగా నడిగర్ సంఘంలో కుట్రలూ కుతంత్రాలూ జరుగుతుంటాయి. ఎన్నో డ్రామాల నడుమ నడిగర్ సంఘానికి అధ్యక్షడయ్యాడు నాజర్. ఈయన వచ్చినా… నడిగర్ లో ఎలాంటి మార్పులూ రాలేదు. పైగా… పది కోట్ల నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు… నడిగర్ రాబడి ఎంత, ఖర్చు ఎంత? లెక్క తేలాలన్నది నడిగర్ సభ్యుల వాదన. ఈ నేపథ్యంలో… నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో కీలకమైన పత్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
అయితే ఇదంతా… కుట్రే అన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడ లెక్కలు చూపించాల్సివస్తుందో అని… కుట్రపన్ని అగ్ని ప్రమాద నాటకం ఆడించారని, ఈ ప్రమాదంపై సమగ్రమైన దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కార్య దర్శిగా ఉన్న విశాల్ పని తీరు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా నడిగర్ సంఘంలోని సభ్యులు గుర్రుగా ఉన్నారు. తాజా అగ్ని ప్రమాదం నడిగర్ లో మళ్లీ మంటలు చెలరేగేలా చేశాయి. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటివాళ్లు కాస్త చొరవ చూపి, నడిగర్ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలని తమిళ చిత్రసీమ కోరుకుంటోంది. మరి వాళ్లేం చేస్తారో ?!