కొద్ది రోజుల కిందట.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త.. జగన్ రావాలి.. జగన్ కావాలి అంటూ తాడేపల్లికి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రకు.. వైసీపీ అధికార మీడియాలో తెలంగాణలో ఎక్కడో చోట చోటు కల్పించారు. ఆ పాదయాత్ర చేసింది ఒక్కరంటే.. ఒక్కరు. అసలు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా పోటీకే ఆసక్తి చూపని వైసీపీ రావాలి.. కావాలి అంటూ..ఓ కార్యకర్త పాదయాత్ర చేయడం ఏమిటి..? దానికి సాక్షి పత్రిక కవరేజీ ఇవ్వడం ఏమిటి..? అన్న సందేహం.. దాన్ని చూసిన వారికి వచ్చింది కానీ..అదో ఇమేజ్ బిల్డింగ్ టెక్నిక్ అని లైట్ తీసుకున్నారు. కానీ దాని వెనుక ఓ వ్యూహం ఉందని… ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని తెలంగాణ రాజకీయవర్గాలు అంచనాకొస్తున్నాయి. ఆ వ్యూహమే… తెలంగాణలో మళ్లీ వైసీపీని రాజకీయ శక్తిగా మార్చడం.
తెలంగణలో వైసీపీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. పార్టీ బాధ్యతల్ని షర్మిలకు ఇవ్వాలని భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణలోనూ విపరీతమైన అభిమానం ఉందని.. దాన్ని ఓట్లుగా మల్చుకునే అవకాశం తో పాటు.. ఏపీలో అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలు కూడా.. తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయని నమ్ముతున్నారు. అందుకే… తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారని అంటున్నారు. అయితే.. అక్కడ నాయకత్వం ఇతరులకు ఇస్తే.. పెరిగే అవకాశాలు ఉండవు.. ఇస్తే గిస్తే.. ఫ్యామిలీ మెంబర్‌కే ఇవ్వాలి. అందుకే… వైఎస్ షర్మిలకు ఆ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలో దీనికి సంబంధించి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అయితే.. తెలంగాణలో వైసీపీ ఆలోచన… జగన్‌ది కాదని.. కేసీఆర్‌దన్నఅభిప్రాయం కూడా ఉంది. రాజకీయాల్లో మెజార్టీ వాదానిదే లెక్క. ప్రత్యర్థుల ఓట్లను ఎన్ని చీల్చగలిగితే.. అంత విజయం దగ్గరవుతుంది. వందలో ఇరవై ఓట్లు తెచ్చుకున్న ఇతర బరిలో ఉన్న అభ్యర్థులందరూ తలా పదిహేను ఓట్లే తెచ్చుకున్నా.. గెలుపు ఇరవై ఓట్లదే అవుతుంది. ఇదే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను వ్యతిరేకించే రెడ్డి సామాజికవర్గం ఓట్లను వైసీపీ ఆకర్షించాలనే దిశగా… కేసీఆర్ ఈ వ్యూహాన్ని పన్నుతున్నారని.. దానికి జగన్ అంగీకరించారన్న ప్రచారం అంతర్గతం ప్రారంభమయింది.
భారతీయ జనతా పార్టీ..ఈ సారి అగ్ర కులాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇచ్చే అవకాశం లేదు. బీసీ నినాదాన్ని ఆ పార్టీ ఎత్తుకునే అవకాశం ఉంది. కొత్తగా నాయకులుగా ఎదుగుతున్న వారిలో అత్యధికులు బీసీలే. అదే సమయంలో తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్… బడుగు బలహీనవర్గాల్లోకి విస్తృతంగా వెళ్తుందని నమ్ముతున్నారు. అందుకే… కేసీఆర్…దానికి విరుగుడుగా వైసీపీని తెలంగాణలోకి ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.