కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విడుదల చేసే నిధులు ఆ ప్రాజెక్టుకు మాత్రమే ఖర్చు చేయాలని ఇతర వాటికి మళ్లించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చేసింది. గత ఏడాది ఇలా విడుదల చేసిన నిధులు.. దాదాపు రూ. మూడు వేల కోట్ల నిధులు ప్రభుత్వం ఇతర వాటికి ఖర్చు చేసేయడంతో ఈ సారి కేంద్రం రూటు మార్చింది. ప్రత్యేకంగా ఖాతా ఏర్పాటుచేసి.. ఇప్పుడు విడుదల చేయాల్సి ఉన్న రూ. 2200 కోట్లను విడుదల చేయబోతోంది. పోలవరం ప్రాజెక్టుకు తప్ప.. మరో అవసరానికి ఆ నిధులు ఖర్చు చేయడానికి లేదు. ప్రస్తుతం ఆ ఖాతా నిర్వహణ విధి విధానాల ఖరారులో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఉంది.
పోలవరం ప్రాజెక్టుకు మొదట ప్రభుత్వం ఖర్చు పెడితే.. తర్వాత కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఆ ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం శరవేగంగా ప్రాజెక్టును నిర్మించి.. వేల కోట్లతో పనులు చేయించింది. అలా ప్రభుత్వం దిగిపోయే సరికి.. ఆరు వేల కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒక విడత మంజూరు చేశారు. వాటిని ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడుకుంది. దానికి కారణం కూడా ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులను ఇప్పటికే పోలవరంలో ఖర్చు చేసేశారనేదే ఆ కారణం. ఇప్పుడు మరో విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 200 కోట్ల పనులు కూడా జరగలేదని.. రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చే నిధులు కూడా ప్రభుత్వం ఇతర వాటికి ఖర్చు చేస్తే.. ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోతుందని కేంద్రం ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది.
ఎప్పుడో విడుదల కావాల్సిన నిధులు ఇంత వరకూ విడుదల కాలేదు. అదే పనిగా.. మంత్రి బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి ఢిల్లీకి తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ప్రత్యేక ఖాతా ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త అంచనాలు అంగీకరిస్తేనే ఈ రెండు వేల కోట్లు ఇస్తామని గత పీపీఏ మీటింగ్‌లో కేంద్రం చెప్పింది. చివరికి.. ఈ సారికి ఇస్తామని..మరోసారి నిధులు విడుదల చేయాలంటే.. తగ్గించిన అంచనాలు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది., ఈ నిధులు వస్తే చాలనుకుందేమో కానీ ప్రభుత్వం సైలెంట్‌గా ఉంది. కానీ ఆ నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు.. ఇంకా ఆలస్యం అవుతోదంది. ఒక వేళ వచ్చినా… ప్రాజెక్టుకే ఖర్చు చేయాల్సి ఉంటుంది.